అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు నిందితుల బెయిల్ రద్దు

అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు నిందితుల బెయిల్ రద్దు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితులుకు బెయిల్‌ రద్దైంది. నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు ఇద్దరి బెయిల్‌ను రద్దు చేసింది. ఐపీసీ సెక్షన్ 306ను అమలు పరుస్తూ అడిషన్ సెషన్స్ జడ్జి మొక సువర్ణరాజు బెయిల్ రద్దు చేశారు. డిసెంబర్ 2వ తేదీలోగానిందితులు సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. కోర్టులో ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకార్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నెల 3న నంద్యాలలో అబ్దుల్ సలాం, తన భార్య, ఇద్దరు పిల్లతో కలిసి రైలు కిద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చేయని నేరానికి సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లు చిత్రహింసలకు గురి చేశారు. తనకే తప్పు తెలియదని వేడుకున్నా జాలి చూపలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అబ్దుల్‌ సలాం.. తన భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలో ప్రకపంనలు సృష్టించింది. దీంతో ఆలస్యంగా మేలుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు.. తూతూ మంత్రంగా విచారణ జరిపించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన గంటల్లోనే నిందితులు సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్ బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. బెయిల్‌ రద్దు చేయాలని పోలీసులు నంద్యాల కోర్టును ఆశ్రయించారు.

ఓవైపు నిందితుల బెయిల్‌ రద్దైనా... మరోవైపు సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ముస్తాక్‌ మౌలానా ఆధ్వర్యంలో.. ప్రజాసంఘాలు, మైనార్టీ సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. అబ్దుల్‌ సలాం కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. నిందితులకు శిక్షపడేలా అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని అన్నారు.

సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 3న నంద్యాలలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాల ఆధ్వర్యలో భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కర పత్రాలు, గోడ పత్రాలు ముద్రించాలని తీర్మానించారు. సలాం ఆత్మహత్య కేసులో తూతూ మంత్రంగా విచారణ జరిపి దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని.. నిందితుల కఠినంగా శిక్షించి.. వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్‌ చేస్తోంది సలాం న్యాయపోరాట సమితి.

Tags

Read MoreRead Less
Next Story