సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి : చంద్రబాబు

సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి : చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నలుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య ఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లీం సంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు పోలీసులపై వేటు పడింది. నంద్యాల సీఐతోపాటు హెడ్‌కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. అటు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో డీజీపీ విచారణ కమిటీని నియమించారు.

కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన సలాం అనే వ్యక్తి ఏడాది క్రితం వరకు నంద్యాలలోని ఓ బంగారు షాపులో పనిచేసేవాడు. అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో బంగారం చోరీ కేసు అతని జీవితాన్ని తలకిందులు చేసింది. షాపులో బంగారం పోయిందని..యజమాని కేసు పెట్టాడు. ఇందులో సలాంను ఏ1గా చేర్చారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. బంగారం షాపు యజమాని ఉద్యోగంలోంచి తీసేయడంటో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సలాం. ఇంతలోనే ఈ నెల 2న కరిమద్దెల గ్రామానికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి.. 70 వేల నగదుతో సలాం ఆటో ఎక్కారు. ఈ నగదు పోవడంతో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సలాంను స్టేషన్‌కు పిలిచి విచారించారు.

దీంతో చేయని తప్పుకు నింద వేసి అటు యజమానులు, ఇటు పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. వేధింపులకు తాళలేక చివరకు కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సలాం. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న సలాం కుటుంబ సభ్యులు.. తాము ఏ తప్పు చేయలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తనను, తన కుటుంబ సభ్యులను దారుణంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ఎవరూ సాయం చేయడం లేదని.. చావొక్కటే శరణ్యం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం ఈ నెల 3న రైలు పట్టాల కింద పడి సలాంతో పాటు భార్య, కొడుకు, కూతురు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులతో విచారణ కమిటీ నియమించారు. విచారణ అధికారులుగా ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీ శంకరబ్రత బాగ్చి, గుంటూరు అదనపు ఎస్పీ అరీఫ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ కేసును ఆళ్లగడ డీఎస్పీ పోతురాజు విచారిస్తున్నారు. ఈ ఘటనలో.. సీఐ సోమశేఖర్‌రెడ్డితో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లను అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. తప్పు చేస్తే ఎతంటి వారినైనా వదిలేది లేదని పేర్కొన్నారు. అటు అడిషనల్‌ ఎస్పీ గౌతమి శాలిని సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. సలాం కుటుంబాన్ని సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ వేధించారని తెలిపారు. సలాం కుటుంబం పట్ల దురుసుగా ప్రవర్తించారని విచారణలో తేలిందని పేర్కొన్నారు.

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారనేందుకు సలాం కుటుంబం ఆత్మహత్యే నిదర్శనమన్నారు. నాడు శాసనమండలిలో సభ్యులందరి ముందు చైర్మన్ షరీఫ్‌ని మతం పేరుతో దూషించారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story