సలాం కుటుంబం ఉదంతంపై ఏపీ హైకోర్టులో పిల్

సలాం కుటుంబం ఉదంతంపై ఏపీ హైకోర్టులో పిల్

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్ సలాం కుటుంబం ఉదంతంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కేసును సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి పిల్ వేశారు. మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌ కుమార్.. షేక్ ఖాజావళి తరుపున పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఏపీ డీజీపీ, విశాఖ సీబీఐ ఎస్పీ, కర్నూలు ఎస్పీ, నంద్యాల డీఎస్పీ, నంద్యాల వన్ టౌన్ ఎస్సైలను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.

అబ్దుల్‌ సలాం కుటుంబానికి మద్దతుగా.. నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద న్యాయ పోరాట సమితి నేతలు దీక్షలు ప్రారంభించారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు పోరాట సమితి నేతలు. అన్ని పార్టీలను కలుపుకొని తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సలాం కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగాల నుంచి తొలగించాలన్నారు. ఈ దీక్షకు మాజీ మంత్రులు NMD ఫరూఖ్‌, ఏరాసు ప్రతాపరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకట్‌ రెడ్డిలు మద్దతు తెలిపారు.

అటు..అబ్దుల్‌ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నంద్యాల పట్టణంలో నేషనల్‌ కాలేజ్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు ర్యాలీ తీశారు. కుటుంబం ఆత్మహత్యకు కారణమైన గోల్డ్ షాపు యజమాని, పోలీసులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు.. సలాం ఘటనపై స్పందించకుండా సైలెంట్‌గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డిపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story