Abhaya Gold: పోలీసుల ఆధీనంలో ఉన్న ఆస్తులు మాయం

Abhaya Gold: పోలీసుల ఆధీనంలో ఉన్న ఆస్తులు మాయం
పోలీసుల ఆధీనంలో భద్రంగా ఉండాల్సిన వస్తువులు మాయం

పోలీసుల ఆధీనంలో భద్రంగా ఉండాల్సిన వస్తువులు మాయమయ్యాయి. స్టేషన్‌ ఆవరణలోని వాహనాలకే రక్షణ కొరవడింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.... విజయవాడలో జరిగింది. ఓ ఆర్థిక కుంభకోణంలో సీఐడీ స్వాధీనం చేసుకున్న వాహనాలు, పలు వస్తువులకు రెక్కలొచ్చాయి. పదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అభయ గోల్డ్‌ కుంభకోణంలో సీఐడీ స్వాధీనం చేసుకున్న పలు వస్తువులు కనిపించకుండా పోయాయి. చోరీకి గురయ్యాయని తెలుసుకుని కేసు నమోదు చేసి, గుట్టుగా దర్యాప్తు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కితే ఎవరిపై వేటు పడుతుందోనని అటు సీఐడీ, ఇటు పోలీసు అధికారులు హడలుతున్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కూకట్ల శ్రీనివాస్... విజయవాడ కేంద్రంగా తన బంధువులతో కలసి అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. రోజువారీ, వారం, నెల, వార్షిక డిపాజిట్ల పేరుతో పెద్దఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. అధిక వడ్డీ, ప్లాట్లు ఇస్తానని నమ్మించారు. వసూలు చేసిన డబ్బుతో సొంత ఆస్తులు కూడబెట్టుకుని డిపాజిట్ దారులకు మొండిచేయి చూపారు. 2013లో పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అభయ గోల్డ్, దాని అనుబంధ సంస్థలపై వివిధ స్టేషన్లలో 20 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఆర్ధిక నేరం కావడంతో దర్యాప్తు బాధ్యతలను విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం చేపట్టింది. ఈ కుంభకోణం విలువ 130 కోట్ల రూపాయలుగా తేల్చింది. సంస్థకు చెందిన పలు ఆస్తులను సీఐడీ అధికారులు గుర్తించి కోర్టు ద్వారా ఎటాచ్ చేశారు.

VO2: సీజ్ చేసిన ఆస్తులను విజయవాడ ఏలూరు రోడ్డులోని అభయ గోల్డ్ కార్యాలయంలో ఉంచి 2013 ఆగస్టులో సీల్ వేశారు. వాటిలో వాహనాలు, కార్యాలయ ఫర్నీచర్, కంప్యూటర్లు, పలు వెండి పళ్లాలు, వెండి గ్లాసులు, వెండి పూజా సామగ్రి తదితరాలు ఉన్నట్లు తెలిసింది. వాహనాలను సూర్యారావుపేట స్టేషన్ ఆవరణలో ఉంచారు. చరాస్తులను వేలం వేయాలని 2018 అక్టోబరు 29న విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశించింది. ఇటీవల ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన సీఐడీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు విజయవాడలోని అభయ గోల్డ్ కార్యాలయాన్ని పరిశీలించగా సీజ్ చేసిన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. సూర్యారావుపేట స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఉంచిన వాహనాల గురించి చూడగా, ఒక కారు, బైక్ కనిపించలేదు. మిస్సింగ్‌పై స్టేషన్ సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు. సీఐడీ, పోలీసుల ఆధీనంలోనివే మాయం కావడంతో బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సూర్యారావుపేట స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story