ఏపీలో పలుచోట్ల ఏసీబీ అధికారుల మెరుపుదాడులు
ఏపీలో పలు నగరాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారుల కార్యాలయాల్లో.. ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్యాలయంలో సోదాలు చేపడుతున్నారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. దాంతోపాటు ఆఫీస్‌లోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
అటు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం తహశీల్దార్ కార్యాలయంలోనూ విజిలెన్స్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. దీంతోపాటు జిల్లాలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల ఆధ్వర్వంలో తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో కసింకోట తహశీల్దార్ ఆఫీస్‌లో ACB అడిషనల్ ఎస్పీ షకీలా బాను ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయంలోనూ.. ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గూడూరు టౌన్ ప్లానర్ సతీష్‌పై.. అవినీతి ఆరోపణలు రావడంతో.. ఏసీబీ అధికారులు రంగంలో దిగారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని.. అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com