ACCIDENT: ఫోన్లు ఒక్కసారిగా పేలడంతో బస్సు దగ్ధం

కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ‘తొలుత బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. బస్సు కింది భాగంలో ద్విచక్రవాహనం ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమై పేలింది. ఈ సమయంలో లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి.” అని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి.
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా.. 22 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్లలో ఒకరు పరారవగా.. మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు.
ప్రమాదం ఇలా జరిగింది
హైదరాబాద్‌లోని పటాన్చెరులో ఉన్న ట్రావెల్స్ కార్యాలయం నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బస్సు కిందకు బైక్ దుసుకెళ్లడంతో.. పెట్రోల్ లీక్ అయ్యి మంటలు రాజుకున్నట్లు.. తర్వాత బస్సు మొత్తం వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
డోర్ హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిలైంది
బస్సు డోర్ తెరుచుకోకపోవడమే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ''బస్సు ఇంజిన్‌కు మంటలు వైర్లు కాలిపోవడంతో డోర్స్ కు సంబంధించి హైడ్రాలిక్ వ్యవస్థ పాడైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. దీనివల్ల బస్సు తలుపు తెరుచుకోకపోవడంతో కొందరు ప్రయాణికులు బయటకు వచ్చేందుకు వీల్లేక చనిపోయారు'' అని బీబీసీతో చెప్పారు కలెక్టర్ సిరి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

