ACCIDENT: ఒకే రోజు.. మూడు బస్సు ప్రమాదాలు

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కర్నూల్, చేవెళ్ల బస్సు ప్రమాదాలను మర్చిపోకముందే మంగళవారం మరికొన్ని బస్సు ప్రమాదాలు జరగడంతో ప్రజలు వణికిపోయారు. మంగళవారం తెల్లవారుజామున ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ బస్సు ప్రమాదాలు జరిగాయి.
ఏలూరులో బోల్తా పడ్డ బస్సు
ఏలూరు జిల్లా లింగపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తోన్న భారతి ట్రావెల్స్ బస్సు.. జూబ్లీనగర్ సమీపంలో బోల్తా పడింది.భారతి ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్ సహా 17 మంది ఉన్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మృతుడిని లింగపాలెం మండలానికి చెందిన ప్రవీణ్బాబుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు వణికిపోయారు.
సత్యసాయి జిల్లాలో...
సత్యసాయి జిల్లాలో మరో బస్సు ప్రమాదం సంభవించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు మార్గమధ్యలో సత్యసాయిజిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. చెన్నె కొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా మరో వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా 8 మంది ప్రయాణికులకు గాయాలపాలయ్యారు.
కరీంనగర్లో...
కరీంనగర్లో మరో ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జి వద్ద ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయ్యింది... వేగంగా వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

