Surekha:సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ

చైతూ-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమంతకు మంత్రి క్షమాపణ చెప్పారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. మీరంటే నాకు అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. మరోవైపు నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది. నటులు, రచయితలు, దర్శకులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. నాగ చైతన్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాని, సుశాంత్, రోజా, కోన వెంకట్, శ్రీకాంత్ ఓదెల, అబ్బూరి రవి సహా పలువురు సినీ ప్రముఖులు మండిపడ్డారు. రాజకీయాల కోసం నటులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, దీనిని సహించేది లేదని స్పష్టం చేశారు.
మౌనంగా కూర్చోలేమన్న ఎన్టీఆర్
సమంత, నాగ చైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యంగ్ టైగర్ NTR స్పందించారు. ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా కూర్చోలేమని అన్నారు. ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగి దిగజారిపోయారు. మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని కాపాడుకోవాలి. సినిమా పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చూసి బాధగా ఉంది’. అని ట్వీట్ చేశారు.
వేరే మార్గం లేదంటూ అఖిల్ రియాక్షన్
చైతూ-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై అమల చేసిన ట్వీట్‌కు అఖిల్ స్పందించారు. ‘అమ్మ మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చింది. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.
కొండా సురేఖపై రోజా ఫైర్
అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత రోజా ఫైరయ్యారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘కొండా సురేఖపై BRS నేతల పోస్టులను అందరూ వ్యతిరేకించారు. కానీ, తోటి మహిళపై హేయమైన వ్యాఖ్యలు చేయడానికి సురేఖకు మనసు ఎలా వచ్చింది? మీ రాజకీయ వివాదాల్లోకి మహిళను తీసుకురావడం దుర్మార్గం’ అని రోజా అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com