Adani: అదానీ అడుగుపెట్టిన తరువాతే అనుమతి..!

Adani: అదానీ అడుగుపెట్టిన తరువాతే అనుమతి..!
X
ఏపీలో ఆదానీ గ్రూప్‌ తనకు కావాల్సిన చోట పనులు మొదలు పెట్టేస్తే ఆ తరువాత ఆ భూములను కేటాయించిన కేబినెట్‌

ఏపీలో వింత పరిస్థితి నెలకొంది. ఓ పరిశ్రమ పెట్టాలంటే ముందు ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకుంటే అందుబాటులో ఉన్న భూములను పరిశీలించి కేటాయింపులు చేస్తారు. ఆ తరువాత పరిశ్రమకు సంబంధించిన పనులు మొదలు పెడుతారు. అదేంటో కానీ ఏపీలో మాత్రం ఆదానీ గ్రూప్‌ తనకు కావాల్సిన చోట పనులు మొదలు పెట్టేస్తే ఆ తరువాత కేబినెట్‌ ఆ భూములను కేటాయించింది. మరి అదానీ సంస్థ ముందుగానే ఈ భూములన్నీ మీకే అని వారికి ఎవరైనా చెప్పారో లేదో తెలియదు కానీ మొన్న ఏపీ కేబినెట్‌ అధికారికంగా తీర్మానించి, కేటాయించిన స్థలంలో అదానీ నెలరోజుల కిందటే అడుగు పెట్టారు. అక్కడ పనులు కూడా మొదలుపెట్టారు.

ఇక శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కంపెనీకి 406.46 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించాలని ఏపీ కేబినెట్‌ గత బుధవారం తీర్మానించింది. ఇక్కడ 500 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ట్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కానీ ఈ అనుమతులు రావడానికి నెలముందే గ్రౌండ్‌ లెవల్‌లో ఆ కంపెనీ పనులను మొదలుపెట్టడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మాములుగా అయితే అన్ని అనుమతులు వచ్చాకే కేటాయించిన భూముల్లోకి అడుగుపెట్టాలి. అధికారులు మార్కింగ్‌ ఇచ్చిన తరువాతే పనులు మొదలుపెట్టాలి. కానీ అదానీకి మాత్రం ఆ రూల్స్‌ ఏమి వర్తించవా అని ఉమ్మడి అనంత వాసుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకపోగా, ఏకంగా చిన్నపాటి రహదారినే నిర్మించేశారు. స్టాఫ్‌ ఉండేందుకు భారీ కంటైనర్లను ఏర్పాటు చేసుకున్నారు. వడ్డించే వాడు మనోడైతే మనకేంటి అన్న చందనా అనుమతులు ఎలాగూ వస్తాయి అన్నట్లు ఇక్కడి అదానీ కంపెనీ ప్రతినిధుల వ్యవహార శైలి ఉంది. ఏపీ సర్కార్‌ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలను గత ఏడాది డిసెంబరులో సేకరించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోతాడిమర్రి మండల పరిధిలోని పెద్దకోట్ల గ్రామ పంచాయతీ 203 సర్వే నంబరులో 204.85 ఎకరాలు, దాడితోట గ్రామ పంచాయతీ 221 సర్వే నంబరులో 202.77 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. ఈ భూములనే ప్రస్తుతం అదానీ కంపెనీకి కట్టబెట్టాలని నిర్ణయించారు.

ఇక అదానీ కంపెనీకి భూముల కేటాయింపుపై ఉమ్మడి అనంతపురం గ్రామాల్లో పెద్దచర్చ జరుగుతోంది. పవర్‌ ప్రాజెక్టు వచ్చినా తమకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని గ్రామస్థులు అంటున్నారు. తమ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను అదానీ కంపెనీకి కేటాయిస్తున్నందున, తమ గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే మరోవైపు ఇక్కడ అధికంగా ఉన్న లిథియం తవ్వకాలు కూడా మొదలు పెడతారేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు కుడి వైపు భూములను అదానీకి కేటాయించారు. రిజర్వాయర్‌కు ఎడమ వైపు భూముల్లో లిథియం నిక్షేపాలను గుర్తించారు. దీంతో అదానీ సంస్థల అత్యుత్సాహంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని స్థానికులు భయపడుతున్నట్లు సమాచారం.

Tags

Next Story