amaravathi: విశ్వ నగరంగా రూపొదిద్దుకుంటున్న అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విశ్వ నగరంగా రూపొదిద్దుకుంటోంది. చంద్రబాబు పాలనలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు... సంస్థలు స్థాపించేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీంతో జగన్ పాలనలో అమరావతికి పట్టిన గ్రహణం వీడింది. ఆదానీ సంస్థ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టనుండగా... కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి అండగా ఉంటామని ప్రకటించింది. హైవే, రైల్వే అనుసంధానానికి ఓకే చెప్పింది. భారీ మెజారీటీతో ఎన్డీఏ ప్రభుత్వాలకు అవకాశమిచ్చిన ప్రజల నిర్ణయంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల వరద వస్తోంది. పోలవరానికి, రాజధాని అమరావతికి, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు వేల కోట్లు వస్తున్నాయి.
వాతావరణ కేంద్రానికి తొలగిన అడ్డంకులు
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ రైతులను రోడ్డు మీదకు తెచ్చిన వేళ అప్పట్లో ఐకాస నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినప్పుడు అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం ప్రారంభించాలని కోరారు. స్పందించిన వాతావరణశాఖ అధికారులు.. అమరావతిలో భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే పనులు ప్రారంభిస్తామని లేఖ రాశారు. అమరావతిలోని ఆ శాఖ అధికారులు... సీఆర్‌డీఏ అధికారులను మూడుసార్లు కలిసి తమ భూమి ఎక్కడుందో చూపించాలని కోరగా.. చివరకు సీఆర్‌డీఏ ఒక అధికారిని పంపింది. ఆ స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, గుర్తించలేమని చెప్పి ఆయన వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ ప్రక్రియ ముందుకు కదల్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఆర్‌డీఏ అధికారులతో వాతావరణశాఖ అధికారులు మాట్లాడగా సానుకూల స్పందన వచ్చింది. త్వరలోనే స్థల రిజిస్ట్రేషన్ చేస్తామన్న హామీతో ఈ కేంద్రం ఏర్పాటుకున్న అడ్డంకులు తొలగిపోయాయి.
చంద్రబాబు కీలక చర్చలు
అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీపై హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ సంజయ్ కులశ్రేష్ఠ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధానిలో పదెకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధిపై హడ్కో ఆసక్తి కనబరిచిందని ఆయన వెల్లడించారు. అమరావతి అభివృద్ధిపై వారితో చర్చించినట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com