SCHOOLS: ప్రభుత్వ పాఠశాలలో 'అడ్మిషన్స్ క్లోజ్డ్'

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తికాకముందే విద్యా రంగంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పేరుకు మాత్రమే ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఇప్పుడు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయి. తాజాగా నెల్లూరులోని వీఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలపై ఏర్పడిన విశ్వాసం దానికి నిదర్శనంగా నిలిచింది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన మంత్రి పొంగూరు నారాయణ, పునర్నిర్మాణానికి స్వయంగా శ్రీకారం చుట్టారు. అత్యాధునిక తరగతి గదులు, మంచినీటి సదుపాయాలు, స్మార్ట్ బోర్డులు, మంచి మౌలిక వసతులు అందుబాటులోకి తెచ్చారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా తగినంత టీచర్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ అభివృద్ధిని చూసిన తల్లిదండ్రులు, తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లోనే చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యేలోపే 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలినవి కూడా వేగంగా భర్తీ కావడంతో "అడ్మిషన్స్ క్లోజ్డ్" బోర్డు పెట్టాల్సి వచ్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసాన్ని హర్షించారు. ఈ విజయం ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.
పాఠశాల చరిత్ర ఇది
నెల్లూరు నగరంలోని వెంకటగిరి రాజా వారి (వీఆర్) ఉన్నత పాఠశాల దాదాపు రెండున్నర శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది ప్రయోజకులు మారి గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ స్కూల్లోనే చదివిన మంత్రి నారాయణ... స్కూల్ ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ కమ్రంలోనే విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళికతో తరగతి గదులు, డిజిటల్ సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్య అందించేందుకు వీఆర్ హైస్కూల్‌ను ప్రపంచ నాణ్యత ప్రమాణాలకు తగినట్లు అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో నారాయణ తెలిపారు.
అభిప్రాయం మార్చుకోండి
సర్కారీ బడులంటే పెచ్చులూడిన గదులు, విరిగిపోయిన బల్లలు, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ నెల్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల జనాలు క్యూ కడుతున్నారు. వీఆర్ హైస్కూల్లో తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ తల్లిదండ్రులు తాపత్రయపడుతుండగా.. సీట్లు ఫుల్ కావటంతో ఇలా అడ్మిషన్స్ క్లోజ్డ్ అంటూ బోర్డు పెట్టారు. జూన్ 23 నుంచి వీఆర్ మున్సిపల్ హైస్కూల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ మూడు సెక్షన్లు చొప్పున విద్యార్థులను విభజించారు. మరోవైపు వీఆర్ మున్సిపల్ హైస్కూల్లోనే మంత్రి నారాయణ చదువుకోవటం విశేషం. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలను అభివృద్ధి చేయాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ కుమార్తెలు.. పాఠశాల ఆధునికీకరణలో భాగం పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com