National e-Vidhan Application: ‘నేషనల్ ఇ-విధాన్’ అమలుకు ఎపి ఒప్పందం

ఏపీ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏపీ అసెంబ్లీ, మండలిలో.. 'జాతీయ ఈ విధాన్ యాప్ - నేవా' అమలు కోసం ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, మండలి కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ కేంద్రప్రభుత్వం ఈ యాప్ రూపొందించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో 'నేవా' యాప్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 'నేవా' యాప్‌లో భాగస్వామ్యం అయితే..కాగిత రహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉండనుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.
కాగిత రహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలను డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ (నేవా)లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి చేరాయి. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉమంగ్‌నరులా సమక్షంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్యప్రకాశ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
పార్లమెంట్‌తో పాటు దేశంలోని 31 శాసనసభలు, 6 శాసనమండళ్లను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నేవాను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులకు కూడా ట్యాబ్‌లు అందిస్తారు. అప్లికేషన్ అమలు ప్రారంభమైతే సభా కార్యకలాపాలు అన్నీ డిజిటల్‌గా నిర్వహించడానికి వీలవుతుంది. ఈ యాప్‌లో ప్రతి సభ్యుడికీ ప్రత్యేక డ్యాష్ బోర్డు ఉంటుంది. అందులో సభలో తన కార్యకలాపాలను చూసుకునే వీలు ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com