ఆరోజు చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని సీఎంజగన్ చెప్పారు.. అజయ్ కల్లం వాంగ్మూలం

వివేకాహత్య కేసులో సీబీఐ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన చిన్నాన్న వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని ఆరోజు జగన్ తమకు చెప్పారన్నారు. అజయ్ కల్లం వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసినట్లు తాజాగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఏ సమయంలో చెప్పారని ప్రశ్నించగా‘సమయం నిర్దిష్టంగా గుర్తులేదని, తెల్లవారుజామునే ఇది జరిగిందని పేర్కొన్నట్లు సమాచారం. 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత పులివెందులలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. అదే రోజున... తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్ ఎన్నికల ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో... అజయ్ కల్లం, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సమావేశంలో ఉండగానే తన సతీమణి భారతి నుంచి ఫోన్ రావడంతో జగన్ పైఅంతస్తుకు వెళ్లారు. ఆ తర్వాత కిందికి వచ్చి... చిన్నాన్న గుండెపోటుతో మరణించారని చెప్పినట్లు తెలిసింది. దీంతో... జగన్‌తో ఆ సమయంలో సమావేశమైన వారి నుంచి వివరాలు రాబట్టాలని నిర్ణయించుకుంది సీబీఐ. ఇదే క్రమంలోనే ఇటీవల అజయ్ కల్లంను పిలిచి, ఆయన వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని జగన్ తమకు చెప్పినట్లుగా అజేయ కల్లం వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో ప్రశ్నించారు. తాజాగా అజయ్ కల్లం వాంగ్మూలాన్నీ నమోదు చేసుకున్నారు. ఇక ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణకు త్వరలోనే సీబీఐ నుంచి పిలుపు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com