అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ

అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ
అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. అందుకు సంబంధించిన మందులు కూడా ఇస్తున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు.

కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. కోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు ఇవాళ కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. ఏ2గా ఉన్న అఖిలప్రియను ఏ1గా మార్చిన పోలీసులు మరో రెండు సెక్షన్లు జోడించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆస్పత్రికి తరలించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు పరిశీలించింది.

అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. అందుకు సంబంధించిన మందులు కూడా ఇస్తున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో జైల్లోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని కోర్టు భావించింది. దీంతో అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

అఖిలప్రియ ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నారని, అయినా కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని అఖిలప్రియ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పాటు మెరుగైన చికిత్స సిఫారసు చేస్తూ ఆస్పత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ నేడు జరగనుంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై వాదప్రతివాదనలు కొనసాగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story