Election Campaign: కూటమికే ప్రజల మద్దతు

ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో తెరపడనుండటంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నేతలు సర్వశక్తులొడ్డుతున్నారు. పార్టీలోని ముఖ్యనేతలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లని ప్రసన్నం చేసుకుంటున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ...వాటన్నింటిని పరిష్కరిస్తామంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాల్లో దూకుడు పెంచారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మంథనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారాస హయాంలో గాలికి కూలిపోయే వంతెనలు, ఇసుకలో కుంగిపోయే ప్రాజెక్టులను కట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి... వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంతో కలిసి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద ఎంపీ అభ్యర్థి రఘురామ్‌రెడ్డికి మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి పాల్గొన్నారు. భాజపా హయాంలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో ఎర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలసి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామలకిరణ్ రెడ్డి పాల్గొన్నారు. మరో మూడు రోజుల పాటు ప్రతి కార్యకర్త యుద్ధంలో సైనికుని వలే కష్టపడాలని కిరణ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హనుమకొండలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య పదేళ్లుగా కడియం ఫౌండేషన్ ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టానని ....మున్ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌కు మద్దతుగా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. సీపీఎం, సీపీఐ మద్దతుతో మోదీని ఓడిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికుల వద్ద మగ్గం నేసిన ఆయన కాంగ్రెస్ సభలు, సమావేశాల్లో చేనేత వస్త్రాలు వినియోగించాలని నేతలకు సూచించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత.. నారీశక్తి కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన భాజపాను గెలిపించాలని ఆమె కోరారు. మహబూబాబాద్ భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ ..ఇల్లందులో భారీ రోడ్ షో నిర్వహించారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని లాలాపేట్‌లో భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కేంద్రంలో మరోసారి భాజపా రావాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. LB స్టేడియంలో శుక్రవారం జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com