AP: కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలి

AP: కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలి
అఖిలపక్ష నేతల విన్నపం.... ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడని ఆవేదన

కోడికత్తి శ్రీనుకు న్యాయం జరగాలని కోరుతూ సమతాసైనిక్ దళ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలుగుదేశం, జనసేన, సీపీఐ, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నా శ్రీనుకు బెయిల్ రాకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గెలుపు కోసం జరిగిన కుట్రలో కోడికత్తి శ్రీను పావుగా మారాడన్నారు. కోడికత్తి కేసులో శ్రీనివాస్‌కు మద్దతుగా సమతాసైనిక్ దళ్ ఆద్వర్యంలో విజయవాడలో సమావేశం జరిగింది. జగన్ సీఎం కావాలని కోరుకున్న శ్రీను ఐదేళ్లుగా జైలులో ఉన్నాడని న్యాయం జరగాలని కోరుతూ.... అఖిల పక్షాల నేతలు భేటీ అయ్యారు. దేశ చరిత్రలో హత్యాయత్నం కేసులో ఐదేళ్ల పాటు జైలులో ముద్దాయిగా ఎవ్వరూ లేరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే కుట్రకోణం బయటపడుతోందని... జగన్ భయపడుతున్నారని మండిపడ్డారు. దళితులకు ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం జరగట్లేదని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.


శ్రీనివాస్‌కు న్యాయం జరగాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం అందజేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. అంటరానితనం ఆంధ్రప్రదేశ్‌లో విశృంఖలంగా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. కోడికత్తి శ్రీనివాస్‌కు న్యాయం జరపాలని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం ....కోర్టులకు ఎందుకు హాజరుకావట్లేదని ప్రశ్నించారు.

ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌ న్యాయం చేయాలంటూ జైల్లో నిరాహార దీక్ష చేపట్టాడు. జైల్లో దళిత సంఘ నేతలు శ్రీనును కలిశారు. ఆ సమయంలో ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనును చేతులతో మోసుకొచ్చినట్లు దళిత సంఘ నేతలు తెలిపారు. జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ, జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంపై విశాఖ దళిత సంఘాల కన్వీనర్‌ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. దీక్ష విరమింపజేయడానికి జైల్లో తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, విశాఖ జైల్లో ఏదైనా ప్రాణహాని జరగొచ్చని, వెంటనే శ్రీనును తరలించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శ్రీను హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్‌ అథారిటీలో న్యాయవాది సలీం పిటిషన్‌ వేశారు. శ్రీనుకు మద్దతుగా అతని తల్లి సావిత్రి, సోదరడు సుబ్బరాజు విజయవాడలోని వారి నివాసంలో దీక్షకు పూనుకోగా పోలీసులు భారీగా మోహరించి భగ్నం చేశారు. విజయవాడలో దీక్షకు పోలీసులను అనుమతి కోరగా... ఇవ్వలేదని …. అందుకే ఇంట్లోనే దీక్ష చేపట్టగా మూడు రోజుల తర్వాత భగ్నం చేశారు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ... తన కొడుకుకు న్యాయం జరగాలని శ్రీను తల్లి సావిత్రి స్పష్టం చేశారు.

Tags

Next Story