AP Rains : అల్పపీడనంతో ఆందోళన చెందుతున్న రైతులు

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్నమొన్నటి వరకు వర్షాలు కురవకపోవడంతో ధాన్యం రహదారుల వెంబడి ఆరబోసుకున్న పెడన నియోజకవర్గ రైతులు మళ్లీ వర్షాలు కురుస్తాయేమోనని భయపడుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట నీళ్లపాలవుతుందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో ఈనెల 11 నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు.
ఈనెల 11నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి చేరే అవకాశముందన్నారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కోతకు వచ్చిన పంట చేతికి అందకుండా పోతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
వర్ష సూచన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.Vizianagaram » alpapeedanam again
ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. అలాగే, ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆ ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని నిర్ధేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com