AMARAVATHI: కీలక దశకు అమరావతి చట్టబద్దత

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ కీలక దశకు చేరింది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, కేంద్ర కేబినెట్ ఆమోదంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏపీ రాజధాని వివాదానికి శాశ్వత పరిష్కారం లభించనుంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రకటించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, అమరావతి రాజధాని బిల్లును కేంద్ర కేబినెట్ ముందు ఉంచేందుకు చర్యలు మొదలయ్యాయి. పార్లమెంటు ఆమోదంతో ఈ అంశానికి పూర్తి చట్టబద్ధత కల్పించాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ అంశానికి సంబంధించిన ఫైలుకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆమోదం తెలపడంతో, అమరావతి రాజధాని బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువెళ్లేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు మరికొన్ని కేంద్ర శాఖల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం ఈ బిల్లును కేంద్ర కేబినెట్లో ఆమోదానికి ఉంచనున్నారు.
త్వరలోనే పార్లమెంట్ ముందుకు..
కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉభయసభల్లో పూర్తి మెజారిటీ కలిగి ఉండటంతో, బిల్లు ఆమోదం పొందడం దాదాపు లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలనే నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ చట్టానికి అనుగుణంగా 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అయితే తదనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పాలనా మార్పులతో అమరావతి అభివృద్ధి ప్రక్రియకు తీవ్ర జాప్యం ఏర్పడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీంతో అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ ప్రతిపాదన రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీసి, రాష్ట్రంలో రాజధాని అంశం తీవ్ర వివాదంగా మారింది.దీంతో కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.
కూటమి అధికారంలోకి రాగానే...
అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. కొత్త ప్రభుత్వం అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ, దీనికి శాశ్వత చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. ఈ అంశంపై ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా టీడీపీ ఇదే డిమాండ్‌ను స్పష్టంగా వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన శాశ్వత రాజధానిని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమరావతిని ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో తెలియజేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
కేంద్ర హోంశాఖ అనుమతి
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసిన తేదీ అయిన 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. దీనికి అనుగుణంగా విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర హోంశాఖ అన్ని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియ ప్రారంభించింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల విధానంతో ఏర్పడిన గందరగోళానికి శాశ్వత ముగింపు పలకాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినా రాజధాని అంశం మళ్లీ వివాదంగా మారకుండా ఉండాలంటే పార్లమెంటు చట్టబద్ధత అవసరమని ప్రభుత్వం స్పష్టంగా అభిప్రాయపడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
