AMARAVATHI: అమరావతిలో అమరజీవి స్మృతివనం

భావితరాలకు గుర్తుండిపోయేలా అమరజీవి పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడిన 58 రోజులకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పొట్టిశ్రీరాములు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు. తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్రం కలను ప్రాణాలు తృణప్రాయంగా అర్పించి 58 రోజుల్లోనే సాకారం చేసిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములని సీఎం చంద్రబాబు నాయుడు కీర్తించారు.
‘పొట్టి శ్రీరాములుకు తొలుత గుర్తింపునిచ్చిన పార్టీ తెదేపా. మన నాయకుడు ఎన్టీఆర్ 1985లో తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారు. ఆయన పుట్టిన నెల్లూరు జిల్లాకు శ్రీపొట్టి శ్రీరాములు పేరును నామినేట్ చేస్తూ 2003 మార్చి 10న కేంద్రానికి పంపా. 2008లో దాన్ని కేంద్రం నోటిఫై చేసింది’ అని సీఎం గుర్తుచేశారు. ‘నెల్లూరు జిల్లాలో శ్రీరాములు పుట్టిన ఇంటిని మెమోరియల్‌గా మార్చి, అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఆయన ప్రారంభించిన ఆసుపత్రిని అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలందేలా చూస్తాం. 1956,నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పాటైంది. ఈ తేదీలపై కొందరు రాజకీయ దుమారం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే అమరజీవి ఆత్మార్పణ చేసిన దినాన్ని డే ఆఫ్ శాక్రిఫైస్ గా నిర్వహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆయన ప్రాణాలు విడిచిన చెన్నైలోని భవనాన్ని ‘త్యాగ భవనం’గా గుర్తించి, పరిరక్షిస్తామ’ని చెప్పారు. ‘ప్రజల్ని మభ్య పెట్టేందుకు మెడికల్ కాలేజీల అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. మెరుగైన చదువు, సేవలు కావాలంటే పీపీపీనే సరైన విధానమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. పీపీపీ విధానంలోనే రహదారులు, ఎయిర్ పోర్టులు వంటి సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు పీ4 తెచ్చాం. 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యం’అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంతకుముందు అమరజీవి జీవిత విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చంద్రబాబు తిలకించారు. ఆర్య వైశ్యుల కులదైవం వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం. అమ్మవారు జన్మించిన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండ అని మార్చాం. ఆర్య వైశ్యుల విన్నపం మేరకు కేస్ట్ సర్టిఫికెట్లలో మార్పులు చేస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వాసవీ పెనుగొండ మండలంగా పేరు మార్చినందుకు మహిళలు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియచేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

