AMARAVATHI: అమరావతిలో మరో కీలక ఘట్టం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ఒక కీలక కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో.. ఒకే రోజు, ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. దీంతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు ప్రత్యేక ప్రధాన కార్యాలయాలు లేవు.దీంతో ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్10 రోడ్ వద్ద గత ప్రభుత్వాన్ని కింద వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది.
ప్రధాన బ్యాంకులన్నీ ఒకే ప్రాంగణంలో..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ఎకరాలు, ఆప్కాబ్‌కు 2 ఎకరాలు, కెనరా బ్యాంకు, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు తదితర వాటికి 25 సెంట్లు చొప్పున ఒకేచోట ఇచ్చారు. ప్రధాన కార్యాలయాన్నీ 14 అంతస్తులు, లక్ష చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మించనున్నారు. వీటి కార్యకలాపాలు విజయవాడ నుంచి అమరావతికి మారితే అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ భూములను ప్రస్తుతం శుభ్రం చేసి, కంచెలు వేశారు. శంకుస్థాపన, అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తున్నారు. స్టేట్ బ్యాంకుకు కేటాయించిన స్థలంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. సభా వేదికపై నుంచే అన్ని బ్యాంకుల భవనాల నిర్మాణాలకూ ఒకేసారి శంకుస్థాపన చేస్తారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అమరావతిలో సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వ విధ్వంసం నుంచి కోలుకుంటున్న రాజధానికి మేలు కలుగుతుంది. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com