AP: అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్ !

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరడంతో అమరావతి పునర్నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పెనుమాకలో రాజధాని, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రెండు రోజుల్లో రైతులు 2.65 ఎకరాలను ఇచ్చారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లోనూ అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించనున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పూలింగ్‌లో భూములిచ్చేందుకు ముందుకొచ్చే వారి నుంచి తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్.. రాజధానిలో భూ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియను నిలిపివేయడంతో పాటు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది. రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరణ విధానంలో తీసుకుంది. మరో 4 వేల ఎకరాలను సమీకరించాల్సి ఉండగా, రైతులు ముందుకు రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అమరావతిలో గవర్నమెంట్, జస్టిస్, ఫైనాన్స్, నాలెడ్జ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం సిటీల పేరుతో నవ నగరాలను నిర్మించే ప్రణాళికతో అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ బృహత్ ప్రణాళికను యథాతథంగా పట్టాలెక్కించేందుకు అప్పట్లో భూములు ఇవ్వని గ్రామాల్లో సమీకరణ పద్ధతిలో తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎక్కువ విస్తీర్ణంలో స్థలాలు తీసుకోవాల్సిన ప్రాంతాల్లో యూనిట్ కార్యాలయాలను ప్రారంభించారు.
ఉండవల్లి, పెనుమాక, రాయపూడి, మందడం, వెలగపూడి, నిడమర్రు తదితర గ్రామాల్లో భూమి సమీకరించాల్సి ఉంది. ఈ విధానంలో భూమి ఇచ్చే వారికి త్వరలో రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించనున్నారు. మరోపక్క, రాజధానిలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఓ ప్రకటనలో దరఖాస్తులు ఆహ్వానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com