AMARAVATHI: ఇక జెట్ స్పీడ్‌తో అమరావతి పనులు

అమరావతి నిర్మాణంలో కీలక ముందడగు పడింది. లక్షలా మంది ప్రజల సాక్షిగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులకు ప్రధాని మోదీ అంకురార్పణ చేశారు. కృష్ణమ్మ తీరాన అమరావతిని అద్భుతంగా నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసింది. రాజధానికి పునరుజ్జీవం వచ్చినట్లే అని ఆంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతులు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కూటమి నేతలు ఏం ఆశించారో అవే మాటలు ప్రధాని మోదీ నోటి నుంచి వచ్చాయి. " అమరావతిలో ఉన్నవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కావని... వికసిత్ భారత్ పునాదులు" అంటూ రాజధాని అమరావతి గురించి ఒకే ఒక్క ముక్కలో ప్రధాని తేల్చి చెప్పేశారు.
మూడేళ్లలోనే పూర్తి
అమరావతి నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. ఆంధ్రుల రాజధాని అనే స్వప్నం త్వరలోనే సాకారం కాబోతోందన్న విషయం తన కళ్ల ముందు మెదులుతోందని చెప్పడంతో.. ఏపీ ప్రజలకు అమరావతిపై ఉన్న అనుమానాలన్నీ చెరిగిపోయినట్టే కనిపించాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలతో అమరావతి పనులు ఇప్పటివరకూ ఒక లెక్క... ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా సాగుతాయని కూటమి ప్రభుత్వం ధీమాగా చెప్తోంది. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ స్టేట్‌మెంట్‌తో జస్ట్ మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే క్లారిటీ వచ్చినట్టైంది.
అమరావతి 2.0
అమరావతి 2.0 మొదలైందనడానికి గుర్తుగా అమరావతి ప్రధాన మంత్రి పైలాన్‌ను ఆవిష్కరించారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను 77 వేల 249కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. మోదీ ఒక్కరోజే 49 వేల 040కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ పనుల ప్రారంభంతో అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. వేల కోట్ల రూపాయల పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచిస్తోంది. మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి అమరావతిని అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముమ్మరంగా పనులను నిర్వహిస్తోంది. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లను మూడేళ్లలో ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com