AMARAVATHI: అమరావతిలో అమరజీవి నిలువెత్తు రూపం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ఆవిష్కరించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహంగా ఇది రికార్డు సృష్టించింది. శాఖమూరులో సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అమరజీవి స్మృతివనం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేయడం విశేషం.
చంద్రబాబు ఘన నివాళి
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి అని అన్నారు. తన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికారని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా లోకేశ్ ఘన నివాళి అర్పించారు. సమాజంలో పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శమని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శమని తెలిపారు. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు వివరించారు.
రెండో దశలో మ్యూజియం, స్కిల్ సెంటర్
స్మృతివనం అభివృద్ధి కేవలం విగ్రహానికే పరిమితం కాకుండా, రెండో దశలో మరిన్ని వసతులు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా.. అత్యాధునిక మ్యూజియం, ఆడిటోరియం, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్మించనున్నారు. అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటూ, భావితరాలకు ఆయన ఆశయాలను చాటిచెప్పేలా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దినట్లు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన గౌరవార్థం అమరావతిలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
