అమరావతి రైతులకు సంకెళ్లువేయడంపై ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు

అమరావతి రైతులకు సంకెళ్లువేయడంపై ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు

అమరావతి రైతులకు సంకెళ్లువేయడంపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు పలు చోట్ల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల రైతులు తుళ్లూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు. తూళ్లూరు రైతు దీక్షా శిబిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రైతులు పాదయాత్రగా వెళ్లారు. దేశంలో ఎక్కడా దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టలేదని రైతులు మండిపడ్డారు. దళితులపై దమనకాండ జరుగుతుంటే దళిత హోంమంత్రి మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లేంత నేరం ఏం చేశారని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. అరెస్టైన రైతు కుటంబాలను వర్ల పరామర్శించారు. టీడీపీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

రైతులకు బేడీలు వేయడాన్ని తీవ్రంగాతప్పుపట్టారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ఈసందర్బంగా ఆయన గుంటూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఎస్సీ లపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెట్టడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు.

అమరావతి రైతుల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ సెంటర్‌ వద్ద మాజీ హోం మంత్రి ,ఎమ్మెల్యే చిన రాజప్ప నాయకత్వంలో నిరసన నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం శ్రీనివాసపురంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రాజధానిలో రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ దీక్షకు దిగారు. నల్లజెండాలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

రాజధానికి భూములిచ్చిన దళిత, బీసీ, రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఒంగోలులో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రైతులపై అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో అమరావతి రైతుల అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు ,కార్యకర్తలు నిరసన తెలిపారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న గాంధి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సారధ్యంలో చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఇక శ్రీకాకుళంలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్‌బాబు అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలవేసి నిరసన తెలిపారు. కవిటి మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా... స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి... వినతిపత్రం సమర్పించారు సీపీఐ నాయకులు. నలుగురికి అన్నం పెట్టే రైతన్నలను అవమానించడం దారుణమన్నారు.

రాజధానిరైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరిలో చేతులకు సంకెళ్లువేసుకొని నిరసన తెలిపారు జేఏసీ నేతలు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్‌ సర్కిల్లో నిరసన చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story