కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు వేయడంపై నిరసనలు

కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు వేయడంపై నిరసనలు

నకిలీ ఉద్యమాన్ని ప్రశ్నిస్తే కేసులు.. పెయిడ్ ఆర్టిస్టుల్ని ఆపితే కేసులు అన్నట్టుగా అమరావతిలో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని JAC ప్రతినిధులు మండిపడుతున్నారు. కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతుల అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ రాజధాని గ్రామాల్లో ఇప్పటికే ర్యాలీలు చేపట్టారు. ఇక గురువారం జేఏసీ పిలుపుతో ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాల వద్ద నిరసన తెలపనున్నారు. ఆ తర్వాత అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. 3 రోజులపాటు నిరసనలు కొనసాగించాలన్న అమరావతి జేఏసీ పిలుపుతో రాజధాని ప్రాంతంలోని రైతులు, దళితులు, మహిళలు, రైతుల కూలీలు అంతా ఒక్కటై నినదిస్తున్నారు. రైతులు, జేఏసీ నేతలతో కలిసి టీడీపీ నేతలు కూడా గురువారం నిరసనల్లో పాల్గొనాలని నిర్ణయించారు.

అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలంటూ చేస్తున్న ఉద్యమం 317వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు సహా మరికొన్ని చోట్ల దీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లకు ఈ ప్రభుత్వం సంకెళ్లు వేస్తోందంటూ సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story