రోజురోజుకు ఉదృతమవుతోన్న అమరావతి రైతుల పోరాటం

అమరావతి రైతుల పోరాటం రోజురోజుకు ఉదృతమవుతోంది. జైల్ భరో సందర్భంగా పోలీసుల దౌర్జన్యకాండపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు తీరును నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో బంద్ పాటించారు. అమరావతి జేఏసీ ఇచ్చిన బంద్‌లో స్థానికులు స్వచ్చందంగా పాల్గొన్నారు.దీంతో చాలా ప్రాంతాల్లో నిర్మాణుష్య వాతావరణం నెలకొంది. రైతులపై అక్రమ కేసులను నిరసిస్తూ పలు చోట్ల కాగడాల ప్రదర్శన చేపట్టారు. కొవ్వొత్తులు వెలగించి రైతులకు మద్దతు తెలిపారు.
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచారు తిరుపతిలోని మహిళలు. అన్నదాతలపై పోలీసుల దమన కాండను నిరసిస్తూ వారు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులపై అక్రమ కేసులను ఎత్తివేసి, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
రాజధాని రైతుల అరెస్టులను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. మందడంలో మహిళా రైతులు పెద్దయెత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించారు. రాజధానికోసం భూములు త్యాగం చేసిన రైతులను అరెస్టుచేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ వారు కాగడాలను ప్రదర్శించారు. జాతీయ జెండాలను పట్టుకొని నినాదాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com