అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు : రైతులు

అమరావతి ఉద్యమం ఏడాదైన సందర్భంగా రైతులు గ్రామాల్లో ఆందోళనలు ఉధృతం చేశారు. రైతులు, మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. వెంకటపాలెంలో దళితులు బైక్ ర్యాలీ చేయగా.. పెదపరిమిలో రైతులు పాదయాత్ర.. తుళ్లూరుతో ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహించారు. 105 మంది రైతులు మనోవేదనతో ప్రాణాలు కోల్పోయినా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత పోరాటం చేస్తున్న రైతులపై లాఠీ చార్జీలు, అక్రమ కేసులు పెడుతున్నారని, తమను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళల ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా.. గురువారం రాయపూడిలో సంఘీభావ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను.. రాజధాని మహిళలు దగ్గరుండి పర్యవేక్షించారు. తమ భవిష్యత్ తో ఆడుకుంటున్న సీఎం జగన్ కు గుంటూరు మిర్చి రుచి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
సీఎం జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైనట్టేనని గుంటూరు సీపీఐ నగర కార్యదర్శి జంగాల అజయ్ హెచ్చరించారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఇప్పటి వరకు శాంతియుతంగా చెప్పామని, ఇక నుంచి అలా ఉండదని తేల్చిచెప్పారు.
ఏపీ ప్రజలకు రాజధాని అంటూ ఒక్కటి ఉండాలనే ఉద్దేశంతోనే తాము భూములు ఇచ్చామని రాజధాని మహిళలు తెలిపారు. తమ ఉద్యమానికి అమరావతిలోని 29 గ్రామాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా మద్దతు తెలపాలని కోరుతున్నారు.
అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలనే ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనే నినాదాన్ని వదిలిపెట్టబోమంటున్నారు రాజధాని ప్రాంత రైతులు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెబుతున్నారు. ఎన్నాళ్లైనా అలుపెరగని పోరుతో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com