రైతులపై దాడి.. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు

రైతులపై దాడి.. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు

రైతులపై దాడి ఘటనతో మరోసారి అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. రైతుల ఆందోళనలతో రాజధాని గ్రామాలు దద్దరిల్లాయి.. ఒకటి కాదు రెండు కాదు.. 20 గంటలపాటు రోడ్డుపైనే కూర్చొని అమరావతి రైతులు ధర్నా చేశారు. ఎర్రటి ఎండలో గొడుగులు వేసుకుని మహిళలు, రైతులు ఆందోళన చేశారు. తమపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేవరకు శిబిరాల్లోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. రోడ్డుపై ఆందోళన విరమించాలని, దీక్షా శిబిరంలో నిరసనలు తెలుపుకోవాలని డీఎస్పీ సూచించగా.. తమ ప్రాణాలకు పోలీసులు భరోసా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. డీజీపీ హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఎక్కడ నుంచో వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులకు పోలీసులు భద్రత ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ అండతో ఉద్యమం చేసే వాళ్లతో తన్నులు తినాలా అంటూ రైతులు పోలీసులను నిలదీశారు. వెంటనే మూడు రాజధానుల శిబిరం ఎత్తివేయించాలని.. రైతులపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.

మందడంలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.. ప్రభుత్వ దమనకాండపై రైతులు నిప్పులు చెరిగారు.. రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది.. మరోవైపు ఆదివారం రాత్రి నుంచి రోడ్డుపైనే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఓ మహిళ సొమ్మసిల్లి కింద పడిపోయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అంతకుముందు ఉద్దండరాయుని పాలెంలో వాహనాలను అడ్డుకుంటున్న రైతులను రెచ్చగొట్టేలా కారులో అటుగా వచ్చారు వైసీపీ నేత. దీంతో వైసీపీ నేత కారును అడ్డగించారు రైతులు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. వాహనాలకు అడ్డుగా కూర్చున్న వారిని బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్న పోలీసులను రైతులు అడ్డుకున్నారు. పోలీసుల కాళ్లకు మొక్కారు. దీంతో తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది.

అటు రాజధాని రైతుల ఆందోళనలకు విపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. తుళ్లూరు దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, సీనియర్‌ నేత వర్ల రామయ్య, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితతోపాటు పలువురు నేతలు సందర్శించారు. రాళ్ల దాడిలో గాయపడిన రైతులను పరామర్శించారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.. ఆడవారిపై దాడులు చేసిన వారిని చేతగాని వాళ్లనే అంటారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తుళ్లూరులో రాజధాని రైతులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. అమరావతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉద్యమంపై సీఎం అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులపై రాళ్లు వేయించే స్థితికి ప్రభుత్వం వచ్చిందన్నారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని రామకృష్ణ స్పష్టం చేశారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తోపాటు జేఏసీ నేతలు తుళ్లూరు డీఎస్పీతో చర్చలు జరిపారు.. దాడి చేసిన వారిపైవిచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఉద్దండరాయునిపాలెంలో పోలీసు పికెటింగ్‌ పెట్టి గ్రామస్తులకు రక్షణ కల్పిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు.. దీంతో రైతులు ఆందోళన విరమించి దీక్షా శిబిరాల్లోకి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story