దేశం గర్వపడే స్థాయిలో ఆంధ్రులకు రాజధాని ఉండొద్దా?
రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి..అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి... ఐదేళ్లు పూర్తికావడంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు. 310 రోజులుగా అమరావతిలోని 29 గ్రామాల ప్రజలు ఒక్కటై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.. వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు.. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి ఐదేళ్ల క్రితం పునాది రాయి పడితే.. దానిని సమాధి చేస్తూ జగన్ సర్కార్ ఆడుతున్న మూడుముక్కలాటపై రాజధాని గ్రామాల్లో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. దారి పొడవునా నెత్తురులు తర్పణ చేస్తూ, త్రాచుల్లా, రేచుల్లా, ధనుంజయుల్లా విజృంభిస్తూనే గాంధేయ మార్గంలో స్ఫూర్తిదాయక పోరాటం చేస్తున్నారు. ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అంటూ గళమెత్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు.. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 5 ఏళ్లు పూర్తైందని ఆయన గుర్తు చేశారు. విభజన నష్టాన్ని అధిగమించి,13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా దీని నిర్మాణం తలపెట్టామన్నారు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందన్నారు. పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహమన్నారు. శంకుస్థాపన వేడుకకు హాజరైన ప్రధాని, దేశ, విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారని మండిపడ్డారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో.. చట్ట విరుద్ధంగా.. రాష్ట్ర రాజధాని బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. 13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకించి శక్తి సంపన్నం చేసిన ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం సరైంది కాదన్నారు. మన రాష్ట్ర రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడి కర్తవ్యం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు..
విధ్వంసకర ఆలోచనలతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం కష్టపెడుతోంది అంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. విభజనతో అన్యాయమైపోయిన ఆంధ్రులకు దేశం గర్వపడే స్థాయిలో రాజధాని ఉండొద్దా అని ప్రశ్నించారు. అద్భుత రాజధాని శంకుస్థపానకు దేశ ప్రధానితో సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వచ్చి ఆంధ్రులను అభినందించారని గుర్తు చేశారు. కానీ నాటి ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చుని విధ్వంసకర ఆలోచనలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ళ కిందట ఇదే రోజున శంకుస్థాపన చేసుకున్న అమరావతి నిర్మాణం కొనసాగివుంటే ఈరోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉండేదన్నారు. ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసి తమ విషపునీయత చూపించుకున్నారని మండిపడ్డారు.
అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. రాజధానికి మద్దతుగా గుంటూరు నుంచి మహా ర్యాలీ నిర్వహించారు రైతులు. ఈ ర్యాలికి ఎంపీ గల్లా జయదేవ్ సంఘీభావం తెలిపారు. అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్నారు.. పాలకులకు మంచి బుద్ధి కలించాలంటూ దేవుణ్ని ప్రార్థించారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతిని సమాధి చేయాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..
అమరావతి పోరాటంలో న్యాయం ఉంది.. కానీ, అది పోలీసులకు కనిపించడం లేదు.. ఒకే రాజధాని, అది అమరావతే కావాలంటూ చేస్తున్న నినాదంలో ధర్మం ఉంది.. అది ఖాకీలకు వినిపించడం లేదు.. 310 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా ధర్మం వైపు నిలబడలేదు.. ఆదుకోవాల్సిన, అండగా నిలవాల్సిన ప్రభుత్వమే కుట్రలు చేస్తోంది. విషం చిమ్మడానికే అన్నట్లుగా అడుగడుగునా గోతులు తీస్తోంది. వున్న అమరావతిని అభివృద్ధి చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులంటూ వికృత ఆటకు తెరలేపింది. ఈ ఆటలో ఖాకీలు కూడా సర్కారు ఆలోచనలకు తగ్గట్లుగా ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఉద్దండరాయునిపాలెంలో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
రైతుల దీక్షలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది.. దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.. దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలంటూ రైతులు, మహిళలను పోలీసులు హెచ్చరించారు. అయితే, పోలీసుల తీరుపై అమరావతి రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమపై ఎందుకీ కక్ష సాధింపులంటూ పోలీసులను నిలదీశారు. దీనికి పోలీసులు చెబుతున్న కారణాన్ని విని రాజధాని రైతులు నివ్వెరపోయారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న రైతులు వస్తారని.. వారి కోసం అమరావతి రైతులు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులే చెప్పడంతో రైతులు రగిలిపోయారు.
పోలీసులు అనుసరించిన వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.. పోలీసులే పోటీ ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారా..? ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన జరిగింది అమరావతి కోసమా..? మూడు రాజధానుల కోసమా..? 310 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా కనీసం స్పందించని పోలీసులు.. ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర పోరాటానికి ఎలా అనుమతించారని మండిపడ్డారు. రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే అనుమతులు ఇవ్వడం కుదరదని కరాఖండీగా చెప్పే పోలీసులు.. ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ కోసమంటూ కొందరు ముందుకొస్తే వారికి ఆపాయింట్‌మెంట్ ఇవ్వడమేంటి..?అని ప్రశ్నిస్తున్నారు.
రాత్రికి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో రాజధాని రైతులు కాగడాల ర్యాలీ చేపట్టారు. ఒకే రాష్ట్రం -ఒకే రాజధాని అంటూ నినదించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com