బతుకునిచ్చిన భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం ఇలా చేస్తారా : రైతులు

అమరావతి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాజధాని రైతుల ఉద్యమం 263వ రోజుకు చేరింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు ఆందోళనలు ఆపేది లేదంటున్నారు రాజధాని రైతులు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. బతుకునిచ్చిన భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన రైతులు గుండెమంటతో రగిలిపోతున్నారు. తమ త్యాగ ఫలితం ఎక్కడని నిలదీస్తున్నారు. న్యాయ పోరాటంలో అంతిమవిజయం సాధిస్తామని నమ్ముతున్నారు
వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసి రైతుల కక్షపాతిగా మారిందని ఆరోపించారు. తమను మోసం చేయాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మార్చుకోవాలని కోరుతున్నారు రైతులు. 3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినదిస్తున్నారు. రాజధానిని తరలించి తమ పొట్టకొట్టొద్దన్నారు రైతులు. తమకు న్యాయస్థానాలు ఉండగా ఉన్నాయంటున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే ఇప్పుడు అవమానిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అన్నా, అక్కడి ప్రజలన్నా ఈ ప్రభుత్వానికి ఎందుకంత కోపమని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా రైతులు ఐనవోలులో దీక్షా శిబిరం ప్రారంభించారు. దీక్షా శిబిరంలో జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ హాజరయ్యారు. ఇన్నాళ్లూ వెలగపూడిలోనే అక్కడి రైతులతో కలిసి దీక్షలు చేసిన ఐనవోలు రైతులు.. నిన్నటి నుంచి ఐనవోలు దీక్షా శిబిరంలోనే నిరసన తెలుపుతున్నారు. అమరావతి కోసం వేలాది మంది చేసిన త్యాగాలను ప్రభుత్వం వృథా చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com