LOKESH: లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

LOKESH:  లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌
వైసీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న లోకేశ్‌... తననూ అరెస్ట్‌ చేస్తామని ప్రకటిస్తున్నారని వెల్లడి....

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వైసీపీ రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదు చేసిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ లోకేష్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. మంగళగిరి సీఐడీ ఠాణా S.H.Oను ప్రతివాదిగా పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన తండ్రి చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత తననూ అరెస్టుచేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారని పిటిషన్‌లో లోకేశ్‌ పేర్కొన్నారు. వారు చెప్పినట్లే సీఐడీ అధికారులు అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారని మండిపడ్డారు.


ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు వ్యవహారంలో మంత్రి హోదాలో గానీ, ఇతర ఏ హోదాలో గానీ తాను జోక్యం చేసుకోలేదని లోకేష్‌ స్పష్టం చేశారు. అందువల్ల తనపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్‌ 409 కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవి మాత్రమేనన్నారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో ఎలాంటి కొత్త వివరాలను పేర్కొనలేదని వివరించారు. తననూ, తన కుటుంబసభ్యులను, తెలుగుదేశాన్ని అవమానపరిచేందుకే నిందితుడిగా చేర్చారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నానని, ఎలాంటి కారణం లేకుండా తనను అరెస్టుచేసే అవకాశం ఉందని పిటిషన్‌లో తెలిపారు. ఇదే కేసులో ఇతర నిందితులకు న్యాయస్థానం ముందస్తు బెయిలు ఇచ్చిందని గుర్తు చేశారు.

జగన్‌ సర్కార్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం సీఐడీని పావులాగా వాడుకుంటోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులను నిలిపివేసిందని తెలిపారు. రింగ్‌రోడ్డు కోసం ఒక్క అంగుళం స్థలాన్నీ సేకరించలేదని వెల్లడించారు. చట్టంలోని సెక్షన్‌ 17-A ప్రకారం కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు, దర్యాప్తు చెల్లవన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యం ఈ నెల 29న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి ముందు విచారణకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story