ఏపీకి అమరావతె ఏకైక రాజధాని.. ఆన్‌లైన్‌లో భారీ స్పందన
ఏపీకి అమరావతె ఏకైక రాజధాని.. ఆన్‌లైన్‌లో భారీ స్పందన

ఏపీకి అమరావతె ఏకైక రాజధాని.. ఆన్‌లైన్‌లో భారీ స్పందన రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ.. మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. గత సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన.. ఏపీ విత్ అమరావతి డాట్ కామ్ అన్‌లైన్ సర్వేలో ఇప్పటి వరకు 3 లక్షల 79 వేల మందికి పైగా పాల్గొన్నారు. వారిలో సుమారు 95 శాతం మంది ప్రజలు అమరావతికే జై కొట్టారు.
వెబ్‌సైట్ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండి అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆన్‌లైన్ ఓటింగ్‌లో పాల్గొని ప్రజలు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఈ ఆన్‌లైన్ అభిప్రాయ సేకరణను.. టీడీపీ సోషల్ మీడియా వింగ్.. విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లింది.
ఇందులో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు, అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా మీరు కోరుకుంటున్నారా? అనే ఒక్క ప్రశ్నను పెట్టారు. దానికి కింద అవును లేదా కాదు అన్న ఆప్షన్ ఇచ్చారు. వాటిలో ఒకదానిని సెలెక్ట్ చేశాక.. వ్యక్తిగత వివరాలు నింపాలి. వాటిని పూర్తి చేయగానే.. వారి అభిప్రాయం నమోదవుతుంది. అయతే ఒకరు ఒకసారి మాత్రమే ఓటు వేసేలా వెబ్‌సైట్ రూపొందించారు.
అమరావతి చరిత్ర.. రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను చంద్రబాబు ఆ వెబ్‌సైట్‌లో వివరించారు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బింధువన్నారు. రాష్ట్రానికే కాకుండా దేశానికే అభివృద్ధి కేంద్రంగా చేయాలనే భవిష్యత్తు లక్ష్యంతో.. మూడు మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలతో మన దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతుందనే ఆశాభావంతో రూపొందించామన్నారు. అమరావతి అనే పేరు ఘన చరిత్రతో ముడి పడి ఉందన్నారు. అమరావతికి సంబంధించిన ఫోటోలు, పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఓటు వేయండి.. అమరావతిని రక్షించుకోండి అంటూ టీడీపీ కోరింది.