ఆంధ్రుల లక్ష్యం అమరావతి సాధనే!

అందరి లక్ష్యం ఒక్కటే. ఉద్యమే నినాదం. శాంతియుత పోరాటమే ఆయుధం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రోజులుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అడుగడుగునా ఆంక్షలు విధించినా.. అక్రమ కేసుల పెట్టి అరెస్టులు చేసినా.... అధికార బలాన్ని ప్రయోగించి ఉక్కుపాదం మోపినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 29 గ్రామాల్లోనూ అదే జోరు.. అదే హోరు...! ఉద్యమసెగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉన్నాయి. జై అమరావతి నినాదం మార్మోగుతూనే ఉంది. రాజధాని ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్భంగా జేఏసీ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది.
కాసేపట్లో 29 గ్రామాలలోని దీక్షా శిబిరాల్లో JAC జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత అమరావతి పరిరక్షణ మహోద్యమంలో అమరులైన 92 మంది అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి.. ఉద్యమ నినాదాలతో హోరెత్తించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రతి శిబిరం నుంచి 100 మంది తుళ్లూరు శిబిరానికి చేరుకొని నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు. అన్ని దీక్షా శిబిరాల్లోనూ సకలజనుల నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. శిబిరం ముందు నిలిపిన ట్రాక్టర్ ట్రాలీల మీద, ఎడ్ల బండ్ల మీద వినూత్నంగా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఒక ట్రాక్టర్ ట్రాలీ మీద నాలుగు ఉరి కొయ్యలను ఏర్పాటు చేసి " అమరావతి నిర్వీర్యం - రాజధాని ప్రజల మరణశాసనం" అనే సందేశంతో కూడిన నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. మరొక ట్రాలీ మీద న్యాయ దేవతకు పాలాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు రైతులు ఏర్పాట్లు చేశారు.
రాజధాని గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. రైతులతో కలిసి 300వ రోజు ఉద్యమంలో పాల్గొంటారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, తుళ్లూరు, దొండపాడు, అనంతవరంలో లోకేష్ పర్యటిస్తారు. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 8 గంటల వరకు అన్ని గ్రామాల్లో కాగడాల ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పెద్ద ఎత్తున పాల్గొనలాలని జేఏసీ పిలుపునిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com