400వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రజల నిరసన గళమే. ఏ ఊరు చూసినా దీక్షా శిబిరాలే. ధర్నాలు, నిరసనలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉంది. అమరావతి పరిరక్షణే ధ్యేయంగా ఉక్కుసంకల్పంతో రైతులు పోరాడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెబుతున్నారు. రాజధాని పోరాటం 400వ రోజుకు చేరిన సందర్భంగా రైతులు, జేఏసీ నేతలు ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమయ్యారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.
అమరావతి భగ్గుమంటోంది. 400రోజులుగా 29 గ్రామాల్లో ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. రాజధాని కోసం రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని కాపాడుకునే వరకు.. పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు.
YCP సర్కారు 3 ముక్కలాటకు తెరతీసిన నాటి నుంచి 400 రోజులుగా రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులకు కడుపు నిండా తిండిలేదు. కంటి నిండా నిద్రలేదు. న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి అధికారపార్టీ మినహా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు ఉంది. 13 జిల్లాల్లోనూ అమరావతికి మద్దతుగా దీక్షలు జరుగుతున్నాయి. సందర్భం వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకం అమరావతి వైపే నిలబడుతున్నా.. కుట్రలు, పోలీసు బలగాలతో ఉద్యమంపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది.
రాష్ట్రం మధ్యలో రాజధాని ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుందని భావించి తెలుగుదేశం హయాంలో 2014 సెప్టెంబర్ 1న కేబినెట్ తీర్మానం చేశారు. 2015 అక్టోబర్‌లో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేశారు. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నవ నగరాల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి ప్లాన్ సిద్ధమయ్యాక పనులు పరుగులు పెట్టాయి. ఒక్కో భవనం పైకి లేచింది. సింగపూర్ సంస్థలూ రంగంలోకి దిగాయి. వేల మంది కార్మికులు రేయింబవళ్లు పని చేస్తుంటే.. విద్యుత్ వెలుగుల్లో అమరపురి వెలిగిపోయింది. కానీ ఆ వెలుగులన్నీ ఆరిపోయాయి. YCP అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి భవిష్యత్ అగమ్యగోచరమైంది. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటనతో పరిస్థితి మొత్తం తల్లకిందులైంది.
రాజధానికి భూములిచ్చిన వారిలో మొత్తం 29 వేల 881 మంది ఉన్నారు. ఇందులో ఎకరం లోపు ఇచ్చిన చిన్నరైతులే 20 వేల మంది. వీరిలో బీసీలు, దళితులే ఎక్కువ. ఇప్పుడీ రైతులందరికీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది. తమతో కన్నీరుపెట్టించి.. జగన్ సర్కారు ఏం సాధిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com