AMARAVATHI: అమరావతి క్వాంటం వ్యాలీ: 2030 నాటికి ప్రపంచ టాప్-5

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. 2030 నాటికి ప్రపంచంలోని టాప్-5 క్వాంటం కంప్యూటింగ్ హబ్‌లలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యంగా అమరావతి క్వాంటం వ్యాలీ కార్యాచరణను ఖరారు చేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్మిషన్ లైన్స్ ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్‌కు కనెక్ట్ చేసేలా చూడాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
సాంకేతిక విప్లవం దిశగా...
భారతదేశం సాంకేతిక విప్లవం దిశగా మరో కీలక మలుపు తిరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రబిందువుగా మారుతోంది. ఒకప్పుడు పచ్చని వ్యవసాయ భూములతో విస్తరించి ఉన్న తుళ్లూరు ప్రాంతం ఇప్పుడు భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి నిలయంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచం నేడు ఐటీ యుగాన్ని దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు పయనిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏర్పాటు కానున్న “క్వాంటం వ్యాలీ” కేవలం ఒక టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, భారతదేశ భవిష్యత్తు సాంకేతిక సామర్థ్యాలను మలిచే కేంద్రంగా అవతరించే అవకాశాన్ని కలిగి ఉంది. దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో మరింత బలంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్టు ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందనే అభిప్రాయం టెక్నాలజీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొనడం ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేసింది. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి భవిష్యత్తు సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది. భారతదేశం కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఎదగాలని భావిస్తున్న నేపథ్యంలో అమరావతి క్వాంటం వ్యాలీ ప్రారంభం ఒక చారిత్రాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటర్లకు పూర్తిగా భిన్నమైన సాంకేతికత. సంప్రదాయ కంప్యూటర్లు బిట్‌ల ఆధారంగా పని చేస్తే, క్వాంటం కంప్యూటర్లు క్యుబిట్‌ల ఆధారంగా పని చేస్తాయి. ఈ సాంకేతికత వల్ల క్లిష్టమైన సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఏర్పడుతుంది.
ఈ ప్రాజెక్టులో ప్రపంచస్థాయి టెక్నాలజీ సంస్థలు భాగస్వామ్యం కావడం మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. IBM, TCS, L&T వంటి దిగ్గజ సంస్థలు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయి. IBM మరియు TCS కలిసి ఇక్కడ ప్రత్యేకంగా క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.క్వాంటం కంప్యూటింగ్ అల్గారిథమ్స్, అప్లికేషన్లు మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు జరగనున్నాయి. దేశంలోనే కాకుండా ఆసియా ప్రాంతంలో ప్రముఖ పరిశోధనా కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
