AMARAVATHI: అమరావతి రైల్వే లైన్‌పై ప్రజల ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే కీలక ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అమరావతిని నేరుగా జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రత్యేక రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ రావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ రైల్వే లైన్ ఏ మార్గంలో సాగుతుంది, ఎక్కడెక్కడ స్టేషన్లు ఏర్పడతాయి, ఎప్పుడు పూర్తవుతుంది అనే అంశాలపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం అందరికీ అందలేదు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ అమరావతి రైల్వే లైన్‌ను 2024 నవంబర్ 8న అధికారికంగా మంజూరు చేశారు. మొత్తం దాదాపు 56.5 కిలోమీటర్ల పొడవుతో ఈ లైన్‌ను నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ.2047 కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తాన్ని పూర్తిగా ఇండియన్ రైల్వే భరిస్తుండటం గమనార్హం. అయితే రైల్వే లైన్‌కు అవసరమైన భూమిని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంటుంది.
ఈ కొత్త రైల్వే లైన్, మధిర–విజయవాడ మార్గంలోని ఎర్రుపాలెం స్టేషన్ నుంచి ప్రారంభమై, విజయవాడ–గుంటూరు మార్గంలోని నంబూరు స్టేషన్ వరకు ప్రత్యేకంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న మార్గాలకు భిన్నంగా రాజధాని పరిధిలోని గ్రామాల గుండా ఈ లైన్ సాగనుంది. ఈ మార్గంలో పలు కొత్త రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
పెదపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం వంటి ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీంతో రాజధాని ప్రాంతంలోని ప్రజలకు రైల్వే ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైన్ పూర్తయితే అమరావతికి రవాణా పరంగా భారీ ప్రయోజనం కలగనుంది. ఎర్రుపాలెం మీదుగా హైదరాబాద్‌కు, నంబూరు ద్వారా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి వేగం పెరగడమే కాకుండా, ఉద్యోగాలు, వాణిజ్యం, విద్య, పర్యాటక రంగాలపై కూడా దీని ప్రభావం ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అమరావతి రైల్వే లైన్‌ను 2029 జనవరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ గడువు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే భూసేకరణ వేగంపై ఆధారపడి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అవసరమైన భూమిని త్వరగా రైల్వే శాఖకు అప్పగిస్తే, నిర్మాణ పనులు కూడా వేగంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబుతో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ సహా ఉన్నతాధికారులు సమావేశమై ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించారు. రైల్వే లైన్ నిర్మాణంపై ఇరు పక్షాలకు స్పష్టత ఉందని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
