Amaravati To Arasavalli : రైతుల మహాపాదయాత్ర.. అమరావతి నుంచి అరసవిల్లి వరకు..

Amaravati To Arasavalli : అమరావతి రైతుల మహాపాదయాత్ర వెంకటపాలెం దాటి కృష్ణాయపాలెం చేరుకుంది. ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీల నేతలు ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు రైతులతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. సీపీఎం, సీపీఐ కార్యదర్శులు రైతులతో కలిసి నడిచారు.
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్న నినాదాన్ని అన్ని పార్టీల నేతలు వినిపించారు. రాజధాని విషయంలో జగన్ సర్కార్ ముర్ఖంగా ప్రవర్తిస్తోందంటూ విరుచుకుపడ్డారు. రాజధానిని మార్చడానికి గాని, మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి గాని వీల్లేదని హైకోర్టు అంత స్పష్టంగా తీర్పు చెప్పినా సరే... ప్రభుత్వం, మంత్రులు మళ్లీ మూడు రాజధానులు అంటూ పాటపాడడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఏం జరిగినా సరే.. రైతుల మహాపాదయాత్ర అమరావతి నుంచి అరసవిల్లి వరకు దిగ్విజయంగా సాగుతుందంటూ చెబుతున్నారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. ఈనెల 15న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై అమరావతి పాదయాత్ర ప్రభావం పడకుండా ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానుల బిల్లును తెరపైకి తెస్తోందన్న ఆరోపణలున్నాయి. పాదయాత్ర నుంచి జనం దృష్టి మళ్లించేందుకే మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోందని అమరావతి రైతులు సైతం చెబుతున్నారు.
అమరావతిపై వైసీపీ పెద్దలు, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర 2.0కు శ్రీకారం చుట్టారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్ని వర్గాలవారు విడతలవారీగా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. వెంకటపాలెంలో ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర 900 కిలోమీటర్లకు పైగా సాగి.. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యభగవానుడి చెంతకు చేరనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com