వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ధన్యవాదాలు తెలిపిన మహిళా జేఏసీ నేతలు

అమరావతి రాజధాని మహిళ రైతులు జేఏసీ నేతలు హస్తినలో బిజిబిజీ అయ్యారు. ఢిల్లీ వీధుల్లో అమరావతి ఉద్యమహోరు వినిపించేలా, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతిని కాపాడాలంటూ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, జేఏసీ బృందంలో భాగస్వాములుగా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు మహిళా రైతులు. అమరావతి ఒక ప్రాంతానికి చెందినది కాదని.. ఐదుకోట్ల ప్రజల సమస్య అనే విషయాన్ని నేతలకు వివరిస్తున్నారు.
ముందుగా.. అమరావతికి మద్దతు తెలిపినందుకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును కలిసి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి కోసం ఆయన పాటు పడుతున్న తీరుని ప్రశంసించారు జేఏసీ నేతలు. అనంతరం.. డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు మహిళా జేఏసీ నేతలను కనిమొళి వద్దకు తీసుకెళ్లారు. మహిళా జేఏసీ నేతలు.. సుంకర పద్శశ్రీ, వనజ, తంగిరాల సౌమ్యతోపాటు మహిళా రైతులు అమరావతి అంశాన్ని కనిమొళికి వివరించారు. తమ ఆందోళనకు మద్దతివ్వాలని కోరారు. అనంతరం గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. రాజధాని అంశాన్ని జాతీయనేతల దృష్టికి తీసుకెళ్లే అంశాన్ని చర్చించారు.
అమరావతికి 40 శాతం మంది దళితులు, అధిక మొత్తంలో బలహీన వర్గాల వారే భూములిచ్చారని తెలిపారు మహిళా జేఏసీ నేతలు. అమరావతిని కొనసాగిస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
అనంతరం.. .. సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరితోనూ సమావేశమయ్యారు మహిళా జేఏసీ నేతలు. అమరావతిని మద్దతు ఇవ్వాలని ఏచూరిని కోరారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షాను కూడా కలిసేందుకు అపాంట్మెంట్ కోరినట్లు తెలిపారు మహిళా జేఏసీ నేతలు. తమ ఆవేదనను.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు జేఏసీ నేతలు. మొత్తానికి.. రాజధాని విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారు అమరావతి మహిళా జేఏసీ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com