రాజధానికి భూములు ఇవ్వడమే మహిళలు చేసిన నేరమా..? నిలదీస్తే రోడ్లపై ఈడ్చుకెళ్తారా.?

మరి ఇంత రాక్షసత్వమా..? వాళ్లేం పాపం చేశారు..? రాజధానికి భూములు ఇవ్వడమే మహిళలు చేసిన నేరమా..? తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడమే తప్పా..? మరీ ఇలా రోడ్లపై ఈడ్చుకెళ్తారా.? ఆడవాళ్లు అని కనీసం కనికరించరా..? జుత్తు పట్టి గుంజిపడేస్తారా..? మహిళలపట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా..? అక్రమ అరెస్టులు.. ఆందోళనలతో అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. రాజధాని గ్రామాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
గుంటూరు జిల్లా సబ్‌జైల్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జైల్ భరో కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలపట్ల పోలీసులు రాక్షసంగా ప్రవర్తించారు. దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చిపడేశారు. మహిళలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించారు.. ఈ క్రమంలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
శాంతియుత నిరసనపై పోలీసుల జులుం ఏంటని మహిళలు కన్నీరు పెడుతున్నారు.. భూములు ఇచ్చిన తమపై ఈ వేధింపులు ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై ఇంత రాక్షత్వమా అని ప్రశ్నిస్తున్నారు.. ప్రభుత్వ తీరును ప్రశ్నించడమే తాము చేసిన నేరమా..? బలవంతంగా అరెస్టులు చేస్తారా అని మండిపడుతున్నారు.
కృష్ణాయపాలెంలో రాజధాని రైతులకు బేడీలు వేసి అరెస్టులు చేయాడాన్ని నిరసిస్తూ...జైల్ భరో కార్యక్రమానికి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అకారణంగా దళిత రైతులను 8 రోజులుగా జైల్లో కుక్కడం ఏ చట్టం ప్రకారం చేశారని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలి అనుకుంటే.. మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com