అరాచకాలకు అడ్డాగా విశాఖ: అమిత్ షా

అరాచకాలకు అడ్డాగా విశాఖ: అమిత్ షా
జగన్ నాలుగేళ్ల పాలనంతా అవినీతి, కుంభకోణాలే

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో వైజాగ్ సంఘ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేం లేవని ఆయన మండిపడ్డారు.

ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన సంపర్క్ అభయాన్ లో భాగంగా విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న డబ్బులను తన సొమ్ముగా గా చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. రైతలకు ఇచ్చే డబ్బులు, పేదల ఇళ్ళు, చివరికి రేషన్ బియ్యం కూడా కేంద్రం నుంచి తీసుకుంటున్న జగన్ ఇక్కడ మాత్రం తన బొమ్మ వేసుకొని, తన పధకాలుగా చెప్పుకుంటున్నారని దుయ్యబెట్టారు. తనది రైతు సంక్షేమ ప్రభుత్వం అని పదే పదే గొప్పలకి పోయే జగన్ రైతుల ఆత్మహత్యల విషయంలో సిగ్గుపడాలన్నారు. సుందర నగరమైన విశాఖ అరాచకాలకు అడ్డాగా మారిందని, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే భూమాఫియా, మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందన్నారు. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వమే గంజాయి స్మగ్లింగ్ కి కూడా దిగిందన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2019 వరకు 2.7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిందని ఆ డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఆఖరికి రాష్ట్రంలో ఔషధాల తయారీలో కూడా కల్తీ జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు బిజెపి ప్రభుత్వం ఇప్పటికే 2 వందే భారత్ రైళ్లను మంజూరు చేసిందనీ, విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా 450 కోట్లు ఇచ్చామన్నారు. ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధికి, కడప, కర్నూలు విమానాశ్రయాల నిర్మాణానికి సహకరించామన్నారు. దేశం అంతా మోదీ జపం చేస్తోందన్న అమిత్ షా అది బిజెపి విజయం కాదని, 130 కోట్ల భారత ప్రజలకు దక్కిన గౌరవం అని వ్యాఖ్యానించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెపి 300 స్థానాలతో అధికారంలోకి రావడం తథ్యం అన్న అమిత్ షా రాష్ట్రంలో 20 పార్లమెంటు స్థానాలలో బిజెపి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు.

Tags

Read MoreRead Less
Next Story