ఢిల్లీ వీధుల్లోనూ అమరావతి ఉద్యమ హోరు

ఢిల్లీ వీధుల్లోనూ అమరావతి ఉద్యమ హోరు
X
అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.. ఢిల్లీ వీధుల్లోనూ ఉద్యమ హోరు వినిపించేలా, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు..

అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.. ఢిల్లీ వీధుల్లోనూ ఉద్యమ హోరు వినిపించేలా, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇందుకోసం ఢిల్లీ వెళ్లారు అమరావతి మహిళా జేఏసీ నేతలు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మహిళా జేఏసీ నేతలు, రైతులు అంతా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన బృందంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సుంకర పద్మ, సీపీఐ నుంచి అక్కినేని వనజ, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య, జేఏసీ ప్రతినిధి రాయపాటి శైలజ ఉన్నారు. వారితో పాటు మహిళా రైతులు కంభంపాటి శిరీష, సుజాత, ప్రియాంక కూడా ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లోక్‌ సభ, రాజ్యసభ సభ్యులను మహిళా జేఏసీ బృందం కలవనుంది. అలాగే రాజధాని రైతుల కష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వనుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చేస్తున్న తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారందరినీ కోరనున్నారు.

అటు అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఒకే నినాదంతో రైతులు చేస్తున్న దీక్షలు 279వ రోజుకు చేరాయి.. 29 గ్రామాల్లో వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.. రాష్ట్రం కోసం, ఐదు కోట్ల ప్రజల కోసం తాము భూములు ఇచ్చామని.. ఇప్పుడు రాజధానిని మరో చోటుకు తరలిస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు.

ఇలాంటి కక్షా రాజకీయాలు ఎందుకని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు.. అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం సభలు పెడుతుంటే ఏమీ అనని పోలీసులు శాంతియుత నిరసనలు తెలియజేస్తున్న తమపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆస్తులు పోగొట్టుకుని, జీవితాలు పోగొట్టుకుని ఉద్యమం చేస్తుంటే దానిని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. జోక్యం చేసుకోవాల్సిన కేంద్రమే తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం మంచిది కాదంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అమరావతి ప్రాంత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ఇది ప్రజా ఉద్యమంగా మారి మరింత ఉధృతమవుతుందని అంటున్నారు.

Tags

Next Story