మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు నగరంపై పట్టు విషయంలో మరోసారి సంచలన కామెంట్లు చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మంత్రి అనిల్‌కి, ఆనం కుటుంబానికి మధ్య ఇప్పటికే పలుమార్లు విభేధాలు బయటపడిన నేపథ్యంలో.. తాజాగా రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ అమాంతం పెంచేశాయి. 4 దశాబ్దాలుగా ఆనం కుటుంబ రాజకీయ జీవితం నెల్లూరుతో ముడిపడి ఉందన్నారు రామనారాయణరెడ్డి. ఏ పార్టీ నుంచి ఆనం వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. నెల్లూరుతో అదే అనుబంధం కొనసాగిందన్నారు. నెల్లూరు ప్రజలను కలవడానికి తమకు ఎన్నికలే కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ మద్దతుదార్లతో సమావేశం సందర్భంగా రామనారాయణరెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు నగరం నుంచే గతంలో రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు వెళ్ళామని.. తమను నెల్లూరు నుంచి ఎవరు దూరం చేయలేరని ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీ నాయకత్వం ఎక్కడికి వెళ్లమంటుందో అక్కడికి వెళ్లక తప్పదంటూనే నెల్లూరుపై తమ మార్క్ ఉంటుందని చెప్పుకొచ్చారు. పక్క జిల్లాలో పొదిలి, దర్శి, కనిగిరి వరకూ వెళ్లి రాజకీయాలు చేసిన తమకు నెల్లూరు 10 నియోజకవర్గాల్లో రాజకీయం చేయడం పెద్ద కష్టం కాదన్నారు.
దివంగత ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా డిసెంబర్ నెలలో నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు వివాదం తలెత్తింది. ఆ కార్యక్రమం పూర్తికాక ముందే మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై వివేకా కుమారుడు రంగమయూర్ తీవ్రంగానే స్పందించారు. మాజీ మంత్రి రామనారాయణరెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయం పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లింది. ఐతే.. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరుతో తనకేంటి సంబంధమని మంత్రి అనిల్ కూడా వ్యాఖ్యానించారు. ఈ పొలిటికల్ వార్ అంతర్గతంగా అగ్గిరాజేస్తూ ఉండగానే ఇప్పుడు మరోసారి రామనారాయణరెడ్డి నెల్లూరు తమదేనంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com