Anantapur : వైసీపీలో భగ్గుమన్న గ్రూప్‌ రాజకీయాలు

Anantapur :  వైసీపీలో  భగ్గుమన్న గ్రూప్‌ రాజకీయాలు
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది

అనంతపురం జిల్లా వైసీపీలో గ్రూప్‌ రాజకీయాలు భగ్గుమన్నాయ్‌. సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఒకరి ఇలాఖాలో మరొకరు పట్టుకోసం ప్రయత్నిస్తుండటంతో.. పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది.

పుట్లూరు మండలం రంగరాజుకుంటలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పర్యటన సందర్భంగా రోజంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెద్దారెడ్డి వర్గీయులు అడ్డుకుంటారన్న సమాచారంతో.. భారీగా పోలీసులను మోహరించారు. పెద్దారెడ్డి వర్గీయులను గ్రామం విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. గ్రామానికి వైసీపీ ఎమ్మెల్యే వస్తున్న సమయంలో.. అదే పార్టీకి చెందిన తమను ఊరు విడిచి వెళ్లాలని చెప్పడంపై పెద్దారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పుట్లూరు మండలం రంగరాజుకుంటకు వెళ్లిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి జనం షాకిచ్చారు. మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన సిమెంట్‌ రోడ్డు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై స్థానికులు ఎమ్మెల్యేలను నిలదీశారు. అభివృద్ధి పనులు పూర్తి చేయించేలా ఉంటేనే శంకుస్థాపనలు చేయాలని.. ప్రచారం కోసం వద్దని ఓ గ్రామస్తుడు ఎమ్మెల్యేకు సూచించారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిని అభివృద్ధిని చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story