Anantapur: హంద్రీనీవా నీటిని చిత్తూరుకు ?

Anantapur:  హంద్రీనీవా నీటిని చిత్తూరుకు  ?
మంత్రి పెద్దిరెడ్డిపై రైతుల ఆగ్రహం

ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలు, తాగునీటి అవసరాలను పణంగా పెట్టి.... హంద్రీనీవా జలాలను చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారు. అనంత జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి ఒత్తిడితోనే నీళ్లు తరలిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బుక్కపట్నం చెరువు కింది ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేమన్న అధికారులు... చిత్తూరు జిల్లాకు ఎలా తరలిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఈసారి కూడా సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. వర్షాభావ పరిస్థితులను సాకుగా చూపించి... సాగునీరు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు అన్యాయం చేస్తూ హంద్రీనీవా జలాలను చిత్తూరు జిల్లాకు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు 16 టీఎంసీల నీరు చేరింది. అందులో 6 టీఎంసీలను కర్నూలు జిల్లా చెరువులకు మళ్లించారు. మరో 6 టీఎంసీలు జీడిపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేశారు. మిగిలిన నీటిని అనంతపురం జిల్లాలోని ఫస్ట్ ఫేజ్ కాలువకు మళ్లించారు. అయితే... జీడిపల్లిలో నిల్వ చేసిన నీటిని ఉమ్మడి అనంతపురం జిల్లా చెరువులకు పూర్తిగా ఇవ్వకుండా... నేరుగా చిత్తూరుకు తరలించడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం చెరువు ద్వారా... 3 మండలాలకు తాగునీరు, 3వేల200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ చెరువు ద్వారా గత ప్రభుత్వం సాగు, తాగునీటి అవసరాలు తీర్చగా వైకాపా సర్కార్ వచ్చాక పొలాలను బీడు పెట్టుకోవల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. హంద్రీనీవా నీటితో బుక్కపట్నం చెరువును నింపకపోవడమే ఈ దుస్థితికి కారణమని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

బుక్కపట్నం చెరువుపై ఆధారపడి 125 మత్య్సకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చేపల వేటాడి చెన్నైకి ఎగుమతి చేస్తూ ఆయా కుటుంబాలు ఆదాయం పొందుతున్నాయి. ఈ చెరువును నింపకపోవడంతో ఉపాధి కోల్పోయామని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి అనంతపురం జిల్లా చెరువులన్నింటినీ నింపిన తర్వాతే చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకెళ్లారని... రైతులు, మత్స్యకారులు గుర్తుచేస్తున్నారు. కానీ వైకాపా సర్కార్ వచ్చాక మంత్రి పెద్దిరెడ్డి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story