Andhra Pradesh : ఎన్‌కౌంటర్ ఒక్కటే పరిష్కారం : కోటంరెడ్డి

అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానన్నారు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పవుతుందన్నారు. తాను అలా చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై.. వైకాపా నేతలు విమర్శలు చేయడంతో కోటంరెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు.
అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసన్నారు కోటంరెడ్డి. ప్రాణాతిప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్‌కు గురైందంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన మనసు విరిగిందని అన్నారు. ఆధారాలు చూపించి బయటకు వచ్చానని... ఆఖరిదాకా ఉండి మోసం చేయలేదని స్పష్టం చేశారు. నెల ముందు వరకు తనకు ఎలాంటి ఆలోచనలు లేవని... ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికాక దూరం జరిగానంటూ స్పష్టం చేశారు.
దాదాపు 10 మంది మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు తనపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసన్న కోటంరెడ్డి.. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంంతోనే తన వద్ద ఉన్న ఆధారం బయటపెట్టాన్నారు. ట్యాపింగ్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున.. రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేదన్నారు. కోటంరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని.. ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండని ఆయన అన్నారు. శాశ్వతంగా జైల్లో పెట్టండంటూ సవాల్ విసిరారు. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప.. నా గొంతు ఆగే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. తన గొంతు ఆగాలంటే ఎన్‌కౌంటర్ ఒక్కటే పరిష్కారమన్నారు కోటంరెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com