Andhra Pradesh : పెట్రో అమ్మకాలపై బాదుడే బాదుడు..!

పెట్రో ఉత్పత్తుల అమ్మకాల్లో బాదుడు ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు సీఎం జగన్. పెట్రో పన్నులతో చిరు వ్యాపారుల నుంచి సరుకు రవాణా వాహనాల యజమానుల వరకూ అందరి నడ్డి విరుస్తున్నారు. ఈ బాదుడు భరించలేకే పెట్రోలు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు జనం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడే ట్యాంకు నిండా ఇంధనాన్ని భర్తీ చేయించుకుంటున్నారు లారీ, ట్రాక్టర్ల యజమానులు. కాకినాడ, అనంతపురం, కర్నూలు ప్రాంతాల వారైతే పుదుచ్చేరి, కర్ణాటకల్లోని బంకులకు వెళ్లి పెట్రోలు కొంటున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరల్లో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పుదుచ్చేరితో పోలిస్తే ప్రతి లీటరుకు పెట్రోలుపై 15 రూపాయల 71 పైసలు, డీజిల్‌పై 13 రూపాయల 28 పైసలు అధికంగా ఉంది. అమరావతితో పోలిస్తే బెంగళూరులో లీటరు పెట్రోలు దాదాపు 10 రూపాయలు, డీజిల్ 12 రూపాయలకు తక్కువకే లభిస్తోంది. ఏపీలో రేట్లు భరించలేక జనం పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు నింపుకుంటున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాల వృద్ధి గణనీయంగా నమోదైంది. కర్ణాటకలో డీజిల్‌పై 71.24%, పుదుచ్చేరిలో 134.47% వృద్ధి నమోదైంది. పెట్రోలు అమ్మకాల్లోనూ పుదుచ్చేరిలో 53.54%, కేరళలో 29.82%, కర్ణాటకలో 26.33% వృద్ధి కనిపించింది. తమిళనాడులో 20.95% ఉంది. ఏపీలో మాత్రం పెట్రోలు అమ్మకాల్లో 1.03%, డీజిల్ అమ్మకాల్లో 8.04% వృద్ధే నమోదైంది.
ఏపీలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు వృద్ధిపై లేకపోయినా రాబడి మాత్రం విపరీతంగా పెరిగింది. ఏకంగా 1,478 కోట్లు పెరిగింది. ఇదే సమయంలో కర్ణాటకలో 9,413 కోట్ల నుంచి రూ.9,140 కోట్లకు తగ్గింది. పుదుచ్చేరిలోనూ 16.67% పడిపోయింది. దేశంలోని రాష్ట్రాలు అమ్మకం పన్నును తగ్గించడంతో ప్రజలపై భారాన్ని తగ్గించాయి. కానీ సీఎం జగన్ మాత్రం పైసా తగ్గించకుండానే అమ్మకాలపై రాబడి పెంచుకుంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్‌పై బాదుడే బాదుడంటూ గొంతెత్తి అరిచారు జగన్. అప్పట్లో అసెంబ్లీలోనూ టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్రానికి పోతే లీటరు ఆరేడు రూపాయలు తక్కువకు దొరుకుతోందని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ పాలనలో పెట్రో ధరలు అంతకన్నా దారుణంగా ఉన్నాయంటున్నారు జనం. మిగిలిన రాష్ట్రాల కంటే ఆదాయం ఎక్కువగా రావడానికి బాదుడే కారణమంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com