Andhra Pradesh: వేసవి మొదలు కాకముందే తగ్గుతున్న నీటినిల్వలు

Andhra Pradesh: వేసవి మొదలు కాకముందే తగ్గుతున్న నీటినిల్వలు
ప్రస్తుతం మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల్లో కేవలం 288 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు

ఏపీలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వేసవికాలం మొదలు కాకముందే నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల్లో కేవలం 288 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టులన్నింటిలో కలిపి మొత్తం 441 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దాదాపు సగానికి నీటినిల్వలు చేరుకోవడంతో అటు సాగుకు, ఇటు తాగునీటికి కటకటలాడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కలిపి ప్రస్తుతం 103 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం వద్ద కేవలం 2.540 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. ఇక నాగార్జునసాగర్‌లో 101 టీఎంసీలు వినియోగానికి అనువుగా ఉన్నాయి.

ఇక రాష్ట్రవ్యాప్తంగా.... అనేక చోట్ల జలాశయాల్లో నీరు ఉన్నా వాటి పరిధి కొంతప్రాంతానికే పరిమితం కావడం వల్ల ఒక స్థాయిని మించి తాగునీటి అవసరాలకు మళ్లించే వెసులుబాటు లేదు. కొన్ని ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసినా వాటికి ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడం వల్ల తాగునీటిని దూర ప్రాంతాలకు అందించే అవకాశం లేకుండా ఉంది. వేసవిలో ఇవే నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. మళ్లీ జూన్‌లో రుతుపవనాలు వచ్చినా వానలు ఊపందుకునే సరికి జులై వస్తుంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే రాష్ట్ర జలాశయాల్లో ఉన్న నీళ్లు తక్కువేనని జలవనరులశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఉమ్మడి జలాశయాల్లో ఇంతకన్నా30 టీఎంసీలు అధికంగా ఉన్నాయి. అదే రాష్ట్రంలోని ఇతర జలాశయాల్లో 17 టీఎంసీలు ఎక్కువగా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story