Andhra Pradesh : ప్రమోన్మాది విష్ణువర్థన్ రెడ్డికి జీవిత ఖైదు

డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసులో నరసరావుపేట కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రమోన్మాది విష్ణువర్థన్ రెడ్డికి జీవిత ఖైదుతో పాటు 2వేల 500ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. రెండేళ్ల పాటు విచారించిన నరసరావుపేట కోర్టు.. అన్ని ఆధారాలు పరిశీలించి విష్ణువర్థన్ రెడ్డికి జీవిత కాల శిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
2021 ఫిబ్రవరి 21న పల్నాడు జిల్లా ముప్పాళ్లకు చెందిన అనూష హత్యకు గురయ్యింది. నరసరావుపేటలో డిగ్రీ చదువుతున్న అనూషను విష్ణువర్థన్ రెడ్డి అనే ప్రేమోన్మాది దారుణంగా హతమార్చాడు. ప్రేమ పేరుతో అనూషను వేధించిన విష్ణువర్థన్ రెడ్డికి లొంగపోవడంతో పథకం ప్రకారం హత్య చేసి.. మృతదేహాన్ని పంటపొలాల్లో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు నాటకం ఆడాడు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు.. విష్ణువర్థన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా విష్ణువర్థన్ రెడ్డి నేరం అంగీకరించాడు.
కేసు విచారణ నరసరావుపేట కోర్టులో రెండేళ్ల పాటు జరిగింది. హత్యకు సంబంధించిన అన్ని ఆదారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అన్ని ఆధారాలు పరిశీలించిన కోర్టు... చివరికి జీవిత ఖైదు విధించింది. ఇక కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన అనూష తల్లిదండ్రులు.. ఇన్నేళ్లకు తమకు న్యాయం జరిగిందన్నారు. అయితే తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్షపడి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com