Nara Lokesh: ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పింది. మరుగుదొడ్ల ఫొటోలు తీసి, అప్‌లోడ్ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో బాత్రూమ్‌ల ఫొటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. అంతకముందు ఆ పనిని ప్రధానోపాధ్యాయులు చేయాలని చెప్పినా.. యాప్‌ల భారం పెరిగిందంటూ రోజుకో ఉపాధ్యాయుడు చొప్పున ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేసేవాళ్లు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఐఎంఎంఎస్ యాప్‌లో బాత్రూమ్‌లో ఫొటోలు తీసే ఆప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ బాధ్యతను ఇతర విభాగాలకు అప్పగించాలని ఆలోచన చేస్తోంది.. ఇలా మరుగుదొడ్ల ఫొటోలు తీయడం నిలిపివేయడంపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. తమకు పెద్ద బాధ తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై ఉదయాన్నే స్కూళ్లలో మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదన్నారు మంత్రి నారా లోకేష్. ఈ విధానాన్ని ఆపేశామని.. యాప్ నుంచి ఆ ఆప్షన్‌ను కూడా తొలగించామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని మంత్రి సూచన చేశారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని.. ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు లోకేష్.
మరోవైపు సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో విద్యాశాఖపైనా చర్చ జరిగింది. రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించేందుకు అడుగులు వేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్కూళ్లలో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని.. ఒకవేళ అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. టీచర్ల కొరత కారణంగా విద్యా విధానంలో నాణ్యత తగ్గకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటికీ వాలంటీర్లను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఎక్కడో చోట స్కూల్లో ఉండాలని.. విద్యార్థులకు శాశ్వత అకడమిక్ నంబరు(ఏపీఏఏఆర్) ఉండేలా చూడాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com