Breaking : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సాంప్రదాయాలు, ఆగమ వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఆలయ వ్యవహారాల్లో ఏ అధికారి జోక్యం చేసుకోకూడదని తెల్చి చెప్పింది. నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాల వంటి విషయాల్లో కమిటీ సూచనలు పాటించాలని.. భేదాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతి సలహా తీసుకోవాలని నిర్దేశించింది. ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు వెసులుబాటు లభిస్తుంది. ఆధ్యాత్మిక విధుల విషయంలో ఏ విషయంలో అయినా సరే ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ అర్చకులకే ఉంటుంది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చు. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవచ్చు.
ఇప్పటికే ప్రొటో కాల్ లో మార్పులు
తిరుమల ఘటన తరువాత ఆలయాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఆలయాల్లో ప్రొటోకాల్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. పట్టువస్త్రాల సమర్పణలో నిబంధనలను ఉత్తర్వుల్లో పేర్కొంది. వస్త్రాలను దేవదాయశాఖ మంత్రి లేదా సీనియర్ మంత్రి మాత్రమే సమర్పించాలి. పట్టువస్త్రాల సమర్పణ, దేవాలయాల్లో రాష్ట్ర పండుగల నిర్వహణకు అయ్యే ఖర్చును సీజీఎఫ్ నుంచి వాడుకోవాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులకు సంబంధించి యూసీలను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ధూప, దీప నైవేద్యాల సాయం రూ.10 వేలకు పెంపు
పండగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రాష్ట్రంలో ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రభుత్వ సాయం నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్. సత్యనారాయణ జీవో నెంబర్ 216 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలతో ప్రభుత్వ సాయానికి చాలా ఆలయాలు దూరం అవుతున్నాయి. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప, నైవేద్యం పథకం అమలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com